Share News

హుస్సేన్‌సాగర్‌లో నీటికాలుష్యం..!

ABN , Publish Date - Oct 31 , 2026 | 08:31 AM

గణపతి విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో నెక్లెస్ రోడ్డులోని హుస్సేన్‌సాగర్‌లో నీటికాలుష్యం అత్యధికంగా నమోదైంది.

హుస్సేన్‌సాగర్‌లో నీటికాలుష్యం..!
Hussain Sagar

  • గణేశ్‌ విగ్రహాల నిమజ్జనంలో 200 ఎన్‌టీయూ గుర్తింపు

  • 164 మిల్లీగ్రాముల సీఓడీ నమోదు

  • నీటిలో కరిగిన ఆక్సిజన్‌ స్థాయిల్లో స్వల్పమార్పులు

  • వివరాలు వెల్లడించిన పీసీబీ

హైదరాబాద్‌ సిటీ: గణపతి విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో నెక్లెస్ రోడ్డులోని హుస్సేన్‌సాగర్‌లో నీటికాలుష్యం అత్యధికంగా నమోదైంది. ఇక్కడ గరిష్టంగా 200 నెఫెలోమెట్రిక్‌ టర్బీడిటీ యూనిట్‌ (ఎన్‌టీయూ.. అంటే నీటిలో పేరుకుపోయిన మట్టి, కాలుష్య కణాలు) నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు శుక్రవారం వివరాలు వెల్లడించింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్‌ పార్కు ఎదురుగా ప్లాట్‌ఫాం నంబర్‌--1, ప్లాట్‌ఫాం నంబర్‌-2, లుంబినీ పార్కు, లేపాక్షీ హ్యాండిక్రాప్ట్స్‌, కంట్రోల్‌ పాయింట్‌-బుద్ధ విగ్రహం ఇలా మొత్తం 6 ప్రాంతాల నుంచి నీటి నమూనాలను సేకరించింది. సెప్టెంబరు 11న, నిమజ్జనం సమయంలో 17, 19, 21, 23 తేదీల్లో, నిమజ్జనం పూర్తయిన తర్వాత 28వ తేదీన టీజీపీసీబీ నీటి నమూనాలను సేకరించి నాణ్యతా పరీక్షలను నిర్వహించింది.


నీటి నాణ్యత పరీక్షలో వెల్లడైన ఫలితాలు..

  • నీటి మసకదనం (టర్బిడీటీ): విగ్రహాల నిమజ్జనం సమయంలో సాగర్‌లోని ఆరు మానిటరింగ్‌ లొకేషన్లలో టర్బిడిటి విలువలు పెరిగాయి. నిమజ్జనం తర్వాత ఈ విలువలు తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్వస్థాయికి తిరిగి చేరుకోలేదు.

  • నిల్వ ఉన్న ఘన పదార్థాలు (టీఎస్ఎస్‌): నిమజ్జనం సమయంలో అన్ని మానిటరింగ్‌ లొకేషన్లలో టీఎ్‌సఎస్‌ (టోటల్‌ సస్పెండెడ్‌ సాలిడ్స్‌) విలువలు పెరిగాయి. నిమజ్జనం తర్వాత తగ్గుదల కనిపించినప్పటికీ పూర్వస్థాయికి చేరుకోలేదు. ఎన్టీఆర్‌ పార్కు ఎదురుగా ఉన్న ప్లాట్‌ఫాం నంబర్‌-1 వద్ద అత్యధికంగా 99 మిల్లీగ్రాముల టీఎస్‌ఎస్‌ నమోదైంది.


  • రసాయనిక ఆక్సిజన్‌ డిమాండ్‌ (సీఓడీ): నిమజ్జనం సమయంలో అన్ని ప్రాంతాల్లోనూ సీఓడీ విలువలు గణనీయంగా పెరిగాయి. నెక్లెస్‌ రోడ్‌ వద్ద అత్యధికంగా 164 మిల్లీగ్రాముల సీఓడీ నమోదైంది. నిమజ్జనం తర్వాత కూడా అన్ని ప్రాంతాల్లో సీఓడీ విలువలు పూర్వస్థాయికి తిరిగి చేరుకోలేదు.

  • జీవరసాయనిక ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ): అన్ని మానిటరింగ్‌ లొకేషన్లలో నిమజ్జన సమయంలోనూ, నిమజ్జనం తర్వాత బీఓడీ విలువలు పెరిగినట్లు నీటి నాణ్యతా పరీక్షలు తేల్చాయి.


city3.jpg

  • మొత్తం కోలిఫామ్‌ బ్యాక్టీరియా: నిమజ్జనం సమయంలో అన్ని ప్రాంతాల్లోనూ మొత్తం కోలిఫామ్‌ బ్యాక్టీరియా స్థాయులు గణనీయంగా పెరిగాయి. నిమజ్జనం తర్వాత నెక్లెస్‌ రోడ్‌, లేపాక్షి హస్తకళల కేంద్రం, బుద్ధ విగ్రహం సమీపంలోని మూడు లొకేషన్లలో తగ్గుదల నమోదైంది. కాగా, లుంబినీ పార్కు వద్ద కోలిఫామ్‌ స్థాయి పూర్వస్థాయికి చేరుకుంది.

  • ఫీకల్‌ కోలిఫామ్‌ బ్యాక్టీరియా: ప్లాట్‌ఫాం నంబర్‌-1, 2 నెక్లెస్‌ రోడ్‌, బుద్ధ విగ్రహం సమీపంలోని నాలుగు లొకేషన్లలో నిమజ్జనం సమయంలో ఫీకల్‌ కోలిఫామ్‌ బాక్టీరియా స్థాయి గణనీయంగా పెరిగింది. నిమజ్జనం అనంతరం తగ్గుదల నమోదైనప్పటికీ, నిమజ్జనానికి ముందు స్థాయికి చేరుకోలేదు. లుంబినీ పార్కు వద్ద నిమజ్జనం తర్వాత మరింత పెరిగింది. లేపాక్షి హస్తకళల కేంద్రం వద్ద మొత్తం కోలిఫామ్‌ బ్యాక్టీరియా స్థాయి నిమజ్జన సమయంలో పెరిగి, నిమజ్జనం తర్వాత కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది.


  • డిసాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌ (డీఓ): గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం కారణంగా హుస్సేన్‌సాగర్‌లో డిసాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌ (నీటిలో కరిగిన ఆక్సిజన్‌) స్థాయిల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోలేదని పరీక్షల్లో వెల్లడైంది.

  • వర్షపు నీటి ప్రవాహ ప్రభావం: సెప్టెంబరు 14, 19, 20, 22 తేదీల్లో కురిసిన వర్షాల కారణంగా క్యాచ్‌మెంట్‌ ప్రాంతాల నుంచి వర్షపు నీరు హుస్సేన్‌సాగర్‌లోకి చేరింది. ఈ నేపథ్యంలో సీఓడీ, బీఓడీ, హార్డ్‌నెస్‌ (నీటి కాఠిన్యం) వంటి కొన్ని నీటి నాణ్యత ప్రమాణాల్లో క్షీణత గమనించినట్లు నీటి నాణ్యత పరీక్షలు తేల్చాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 08:31 AM