హోర్ముజ్‌లో 27 మంది భారతీయులు ఉన్న నౌకపై దాడి.. అందరూ సేఫ్
ABN , Publish Date - Oct 31 , 2026 | 08:11 AM
హోర్ముజ్ జలసంధిలో ఓ నౌకపై దాడి జరిగింది. శుక్రవారం 27 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న పనామా జెండా ఉన్న చమురు నౌక ఎంటీ లూయీపై లింపెట్ మైన్లతో దాడి జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలో ఓ నౌకపై దాడి జరిగింది. శుక్రవారం 27 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న పనామా జెండా ఉన్న చమురు నౌక ఎంటీ లూయీపై లింపెట్ మైన్లతో దాడి జరిగింది. ఓ చిన్న పడవలో వచ్చిన దుండగులు నౌక దగ్గరికి చేరుకుని దాని అడుగు భాగంలో రెండు లింపెట్ మైన్లను అమర్చారు. అవి పేలడంతో నౌకలోని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి. దీంతో నౌక కొద్దిసేపు నిలిచిపోయింది. అయితే, ఈ ఘటనలో నౌకా సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సముద్రంలో చమురు లీకేజీ కూడా జరగలేదు. తర్వాత నౌక తన ప్రయాణాన్ని కొనసాగించింది.
హోర్ముజ్ జలసంధిలో లింపెట్ మైన్లతో దాడి జరగడం ఇదే తొలిసారి. ఒమన్‌లోని ఖసబ్‌కు ఈశాన్యంలో 46 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని బ్రిటన్ సముద్ర వాణిజ్య కార్యకలాపాల సంస్థ తెలిపింది. ఈ ప్రాంతంలో 2017 నుంచే లింపెట్ మైన్ల వినియోగం ప్రారంభమైందని రాయిటర్స్ తెలిపింది. తర్వాతి కాలంలోనూ హోర్ముజ్ జలసంధిలో ప్రయాణించే చమురు నౌకలపై లింపెట్ మైన్లతో దాడులు జరిగాయి. లింపెట్ మైన్లు తక్కువ ఖర్చుతో సులభంగా లభిస్తాయని గ్రీస్‌కు చెందిన సముద్ర భద్రతా సంస్థ మారిస్క్స్ పేర్కొంది. నౌకల అడుగు భాగానికి వాటిని అమర్చడం తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, సులభమైన పద్ధతి అని మారిస్క్స్ తెలిపింది.
ఎమ్‌టీ అర్జనాపైనా దాడి
హోర్ముజ్ జలసంధిలో గురువారం లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న భారీ చమురు నౌక ఎమ్‌టీ అర్జనాపైనా దాడి జరిగింది. ఈ నౌకలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఫిబ్రవరిలో అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఆ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు పెరిగాయి. తమ ఆంక్షలను ఉల్లంఘించి ప్రయాణిస్తున్నాయనే ఆరోపణలతో ఇరాన్ కొన్ని నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోంది. కాగా.. ఎంటీ అర్జనా లో ఉన్న ఇద్దరు భారతీయులు క్షేమంగా ఉన్నారని కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఎక్స్‌లో తెలిపారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. నౌకల నిర్వహణ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ సిబ్బంది భద్రత, సంక్షేమాన్ని పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?