Share News

శబరిమలై రైళ్లు ఫుల్‌

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:19 AM

శబరిమలై యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎర్నాకులం, కొల్లాం, త్రివేండ్రం, కొచ్చి తదితర ప్రాంతాలకు నడిచే రైళ్లకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది.

శబరిమలై రైళ్లు ఫుల్‌

కొల్లాం రైళ్లలో డిసెంబరు వరకూ బెర్తులు నిల్‌

బొకారో ఎక్స్‌ప్రెస్‌, టాటా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌, వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌లకూ తీవ్ర డిమాండ్‌

కొన్నింటికి టికెట్లు జారీ కాని పరిస్థితి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

శబరిమలై యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎర్నాకులం, కొల్లాం, త్రివేండ్రం, కొచ్చి తదితర ప్రాంతాలకు నడిచే రైళ్లకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది. అన్ని రైళ్లకు బెర్తులు నిండిపోయి నిరీక్షణ జాబితా కనిపిస్తోంది. విశాఖ నుంచి శబరిమలై వెళ్లడానికి ఉన్న విశాఖ-కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ (18501), కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ (18567) వారాంతపు రైళ్లు కావడంతో మరింత డిమాండ్‌ పెరిగింది. దీంతో అయ్యప్ప భక్తులు విశాఖ, దువ్వాడ మీదుగా నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆశ్రయిస్తున్నారు.

అయ్యప్ప మాలధారణకు ముందే చాలామంది ప్రయాణ తేదీని నిర్ణయించుకుని ఆయా రోజుల్లో అందుబాటులో ఉండే రైళ్లలో రిజర్వేషన్‌ చేయించుకుంటారు. నవంబరు 16 నుంచి మండలం దర్శనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైళ్లకు మరింత డిమాండ్‌ ఏర్పడింది. గతంలో 120 రోజుల ముందుగా రిజర్వేషన్‌ సదుపాయం ఉండడంతో ప్రణాళికాబద్ధంగా రిజర్వేషన్‌ బెర్తులు పొందేవారు. దీనిని 60 రోజులకు కుదించడంతో ఇక్కట్లు పెరిగాయి.

విశాఖ-కొల్లాం రైళ్లకు బెర్తులు ఫుల్‌

ప్రతి మంగళవారం నడిచే విశాఖ-కొల్లాం (18501) ఎక్స్‌ప్రెస్‌కు డిసెంబరు 22 వరకు అన్ని క్లాసులలో బెర్తులు నిండిపోగా నవంబరు 10న థర్డ్‌ ఏసీ ఎకానమీలో రెండు ఆర్‌ఏసీ సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి గురువారం నడిచే విశాఖ-కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ (18567)కు డిసెంబరు 24 వరకు బెర్తులు అందుబాటులో లేవు.

వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌కు రిగ్రెట్‌...బొకారో బెర్తులు ఫుల్‌

ప్రతిరోజు నడిచే ధన్‌బాద్‌-అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్‌ (13351)తోపాటు టాటా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ (18189), డిబ్రుగర్‌-కన్యాకుమారి వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (22504) రైళ్లకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది. బొకారో ఎక్స్‌ప్రెస్‌, టాటా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లకు డిసెంబరు 25 వరకు బెర్తులు నిండిపోయాయి. డిబ్రుగర్‌-కన్యాకుమారి వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌, టాటా-ఎర్నాకులంలకు నవంబరు, డిసెంబరు నెలల్లో కొన్ని తేదీల్లో రిగ్రెట్‌ ఏర్పడింది. ప్రతి సోమ, బుధవారం నడిచే షాలిమార్‌-త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌ (22642), ప్రతి శుక్ర, శనివారం నడిచే పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ (22644)తోపాటు ప్రతి గురువారం నడిచే షాలిమార్‌-నాగర్‌కోయిల్‌ గురుదేవ్‌ ఎక్స్‌ప్రెస్‌ (12660), ప్రతి మంగళవారం నడిచే హటియా-ఎర్నాకులం ధార్తి ఎక్స్‌ప్రెస్‌ (22837)కు డిసెంబరు వరకూ బెర్తులు లేవు.

చెన్నై రైళ్లపై ప్రభావం

శబరిమలై భక్తుల ప్రభావం చెన్నై వెళ్లే రైళ్లపై పడింది. కొల్లాం, ఎర్నాకులం, కొచ్చి ప్రాంతాలకు నేరుగా ఖరారు బెర్తు లభించనివారు ఎర్నాకులం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నంలో చెన్నై రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో విశాఖ-చెన్నై (22801), విశాఖ-చెన్నై (22869) వారాంతపు ఎక్స్‌ప్రెస్‌లతోపాటు, కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841), మెయిల్‌ (12839), భువనేశ్వర్‌-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ (20853), సంత్రాగచి-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ (22807) రైళ్లపై ప్రభావం పడింది. ఈ ఏడాది శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో రైల్వే అధికారులు మరో ప్రత్యేక రైలును ప్రవేశపెట్టాలని కోరుతున్నారు.

Updated Date - Oct 31 , 2026 | 01:19 AM