ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఎవరికీ రాని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ..
ABN , Publish Date - Oct 30 , 2026 | 03:28 PM
ఇజ్రాయెల్‌లో జరిగిన ఎన్నికలు రాజకీయ అనిశ్చితికి తెరతీశాయి. అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ లభించలేదు.
టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌లో జరిగిన ఎన్నికలు రాజకీయ అనిశ్చితికి తెరతీశాయి. అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ లభించలేదు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ కూటమి అత్యధికంగా 53 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మార్కును చేరుకోలేకపోయింది. మరోవైపు మాజీ సైనికాధికారి గాడి ఐసెన్‌కాట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు వచ్చాయి. అరబ్ పార్టీలకు రికార్డు స్థాయిలో 19 స్థానాలు లభించాయి. 2023 అక్టోబర్ 07న హమాస్ దాడి, దాని తర్వాత గాజా, లెబనాన్, ఇరాన్‌తో యుద్ధాల అనంతరం ఇజ్రాయెల్‌లో జరిగిన మొట్టమొదటి జాతీయ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.
ప్రభుత్వ ఏర్పాటుకు సంక్లిష్ట పరిస్థితులు..
120 మంది సభ్యులున్న ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మెజారిటీ సాధించాలంటే 61 స్థానాలు అవసరం. దీంతో నెతన్యాహు మరోసారి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే అవకాశముంది. అయితే ప్రతిపక్ష కూటమి కూడా అరబ్ పార్టీల మద్దతుతో 67 స్థానాలను సమీకరించగలదు. కానీ అరబ్ పార్టీలతో కలిసి పనిచేయడానికి కొంత మంది ప్రతిపక్ష నేతలు విముఖత చూపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో చర్చలు విఫలమైతే మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు.
ఇరాన్, గాజాపై కొనసాగనున్న ప్రభావం..
ఇజ్రాయెల్ రాజకీయ పరిణామాలు ఇరాన్, గాజాపై ఆ దేశ వైఖరిని ప్రభావితం చేయనున్నాయి. ఇరాన్‌తో ఉద్రిక్తతలు, గాజా భవిష్యత్తు, వెస్ట్ బ్యాంక్‌లో పరిస్థితులు ఇప్పటికే సవాళ్లుగా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఇరాన్, హమాస్ విషయంలో ఇజ్రాయెల్ కఠిన వైఖరిలో పెద్ద మార్పు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గాజాలో హమాస్ నిరాయుధీకరణపై నెతన్యాహు, ఐసెన్‌కాట్ ఇద్దరూ ఒకే వైఖరితో ఉన్నారు.
భారత్‌కు ఎందుకంత కీలకం?
ఇజ్రాయెల్‌తో భారత్‌కు రక్షణ, సాంకేతిక రంగాల్లో బలమైన సంబంధాలున్నాయి. డ్రోన్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైబర్ భద్రత, వ్యవసాయం, అంతరిక్ష రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయి. 2026 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లారు. అయితే ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరిగితే భారత్‌కు ఇంధన సరఫరా, వాణిజ్య మార్గాలు, గల్ఫ్ ప్రాంత భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఇజ్రాయెల్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటూనే అరబ్ దేశాలు, ఇరాన్‌తో దౌత్య సంబంధాలను కొనసాగించడం భారత్‌కు కీలకంగా మారనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
పుతిన్‌తో ట్రంప్ భారీ చమురు ఒప్పందాలు.. అమెరికా కీలక ప్రతిపాదనలు!
మక్కా ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చేశామన్న సౌదీ.. ఆరోపణలను ఖండించిన హూతీలు..