Share News

మక్కా ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చేశామన్న సౌదీ.. ఆరోపణలను ఖండించిన హూతీలు..

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:57 PM

సౌదీ అరేబియా, హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. మక్కా ప్రాంతంలోకి వచ్చిన హూతీల డ్రోన్‌ను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేశాయని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ప్రకటించాయి.

మక్కా ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చేశామన్న సౌదీ.. ఆరోపణలను ఖండించిన హూతీలు..
Mecca Drone Attack

ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియా, హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. మక్కా ప్రాంతంలోకి వచ్చిన హూతీల డ్రోన్‌ను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేశాయని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ప్రకటించాయి. అయితే ఈ ఆరోపణలను హూతీ తిరుగుబాటుదారులు తీవ్రంగా ఖండించారు. మక్కా పవిత్ర నగరాన్ని లక్ష్యంగా చేసుకుని తాము ఎలాంటి దాడీ చేయలేదని స్పష్టం చేశారు. సౌదీ ప్రకటన పూర్తిగా కల్పితమని ఆరోపించారు (Mecca Drone Attack).


సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి తుర్కీ అల్ మాలికీ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటు మిలీషియా ప్రయోగించిన డ్రోన్‌ను మక్కా ప్రాంతంలో అడ్డుకుని ధ్వంసం చేసినట్లు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్ర నగరమైన మక్కా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే డ్రోన్‌ను ఎక్కడ అడ్డుకున్నారనే వివరాలను సంకీర్ణ దళాలు వెల్లడించలేదు (Saudi Arabia vs Houthi Rebels).


మరోవైపు సౌదీ ప్రకటనపై హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరియా స్పందించారు (Saudi Houthi Conflict). సౌదీ అరేబియా భూభాగంపై శుక్రవారం తాము ఎలాంటి సైనిక చర్యా చేపట్టలేదని స్పష్టం చేశారు. మక్కా గగనతలంలో డ్రోన్‌ను అడ్డుకున్నామంటూ సౌదీ చేసిన ప్రకటన పూర్తిగా కల్పితమని పేర్కొన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హూతీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మక్కా, మదీనా వంటి పవిత్ర నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు గతంలో కూడా సౌదీ ఆరోపణలు చేయగా, వాటిని హూతీలు ఖండించారు.


ఇవి కూడా చదవండి..

పుతిన్‌తో ట్రంప్ భారీ చమురు ఒప్పందాలు.. అమెరికా కీలక ప్రతిపాదనలు!


పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 30 , 2026 | 02:04 PM