ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?
ABN , Publish Date - Oct 30 , 2026 | 06:50 PM
ఎల్ నినో తరువాత లా నినా వస్తే భారత్‌లో రుతుపవనాలు బలపడి వచ్చే ఏడాది అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు ఎల్ నినో. ఎల్ నినోతో రుతుపవనాలు బలహీనపడి భారత్ లాంటి దేశాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఎల్ నినో ప్రభావం ఇంకా ముగిసిపోలేదని ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే నెలల్లో ఎల్ నినో ప్రభావం గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఎల్ నినో ప్రభావం కొనసాగుతుంది. ఆ తరువాత మాత్రం కరువు తీరిపోయేలా వర్షాలు పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు..
ఎల్ నినో తరువాత లా నినా.. కుండపోత వర్షాలు?
పసిఫిక్ మహాసముద్రం అధిక ఉష్ణోగ్రతగల ఉపరితల జలాలు ఓవైపునకు చేరుకోవడాన్ని ఎల్ నినో అంటారు. ఇందుకు వ్యతిరేక దిశలో జలాలు కదిలితే దాన్ని లా నినా అంటారని నిపుణులు చెబుతారు. భూమధ్య రేఖ వెంబడి సముద్రంపై వీచే గాలులే జలాల కదలికలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక ఎల్ నినో కారణంగా బలహీనపడే రుతుపవనాలు లా నినా కారణంగా బలపడతాయి. ఫలితంగా భారత్‌లో వానాకాలంలో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతుంది.
ఎల్ నినో, లా నినా రెండూ ఎన్‌సో సర్క్యులేషన్‌లో అనే విస్తృత వాతావరణ ప్రక్రియలో భాగమని నిపుణులు చెబుతున్నారు. 3-7 ఏళ్ల వ్యవధిలో ఇవి ఒకటితరువాత మరొకటిగా వస్తుంటాయి. అయితే, ప్రతిసారీ ఇలాగే జరుగుతుందని చెప్పలేమని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉదాహరణకు 2025 చివర్లో ఎల్ నినో బలహీనంగా మొదలై మరుసటి ఏడాది ప్రారంభంలోనే కనుమరుగైంది. ఆ తరవాత శక్తివంతమైన ఎల్ నినో ఏర్పడింది. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
ఈసారి బలమైన ఎల్ నినో ఏర్పడంతో వచ్చే ఏడాది లా నినా ఏర్పడే ఛాన్సుందని నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే భారత్ వంటి దేశాలకు కరువు నుంచి విముక్తి లభించినట్టేనన్న అంచనాలు ఉన్నాయి. అయితే, ఇలాగే జరుగుతుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రంలోని మార్పులను జాగ్రత్తగా గమనిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రఫేల్ జెట్ తొలిసారిగా లాండింగ్
భారతీయ రైల్వే గుడ్ న్యూస్.. హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో పార్సిల్ సేవలు..