భారతీయ రైల్వే గుడ్ న్యూస్.. హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో పార్సిల్ సేవలు..
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:41 PM
ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. కొరియర్ సంస్థల తరహాలో డోర్ టు డోర్ పార్సిల్ డెలివరీ సేవలను భారతీయ రైల్వే ప్రారంభించేందుకు సిద్ధమైంది.
న్యూఢిల్లీ: ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కొరియర్ సంస్థల తరహాలో డోర్ టు డోర్ పార్సిల్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఈ మేరకు ‘ఘర్ సే ఘర్ తక్’ పేరుతో ఇంటి వద్దకే వచ్చి పార్సిళ్లను సేకరించడం, గమ్యస్థానానికి చేరవేయడం వంటి సేవలను ప్రారంభించనుంది. ఈ సేవలను తొలుత దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, పుణె నగరాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా ‘రైల్ పార్సిల్ యాప్’ను అందుబాటులోకి తీసుకురానుంది.
పార్సిల్ రవాణా ఎలా జరుగుతుంది..?
ఈ విధానంలో రైల్వే శాఖ ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థలతో కలిసి పని చేయనుంది. మొదట లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులు వినియోగదారుల ఇళ్లకు వచ్చి పార్సిళ్లను సేకరిస్తారు. అనంతరం వాటిని రైల్వే స్టేషన్‌కు చేర్చుతారు. అక్కడి నుంచి రైళ్ల ద్వారా గమ్యస్థాన నగరానికి పార్సిళ్లు చేరుకుంటాయి. చివరగా అక్కడి లాజిస్టిక్స్ సంస్థలు సంబంధిత చిరునామాకు పార్సిళ్లను డెలివరీ చేస్తాయి.
ఆన్‌లైన్‌లోనే బుకింగ్, చెల్లింపులు..
ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్, లైవ్ ట్రాకింగ్, ఆన్‌లైన్ చెల్లింపులు సదుపాయాలు పొందవచ్చు. ప్రతి బుకింగ్‌కు ప్రత్యేకమైన 10 అంకెల పీఆర్‌ఆర్ నంబర్ కేటాయిస్తారు. యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. డెలివరీ సమయంలో ఓటీపీ ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది. రైలు బయలుదేరడానికి 15 రోజుల ముందు నుంచి ప్రయాణానికి ఒక రోజు ముందు వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పార్సిల్ తీసుకునేలోపు బుకింగ్ రద్దు చేస్తే, రూ.10 క్లరికేజ్ ఛార్జీ మినహాయించి రైల్వే రవాణా ఛార్జీని తిరిగి చెల్లిస్తారు. ఈ సేవలతో చిన్న వ్యాపారులు, ఆన్‌లైన్ విక్రేతలు, సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తుండగా గల్లంతైన హెలికాప్టర్
అలాంటి శారీరక సంబంధం అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు