Share News

అలాంటి శారీరక సంబంధం అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:10 PM

పరస్పర అంగీకారంతో కొనసాగిన శారీరక సంబంధాన్ని బంధం విఫలమైందనే కారణంతో అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రేమ సంబంధం లేదా వివాహ బంధం కొనసాగిన సమయంలో ఇరువురి అంగీకారంతో జరిగిన శారీరక సాన్నిహిత్యాన్ని అత్యాచారంగా పేర్కొనలేమని తేల్చి చెప్పింది.

అలాంటి శారీరక సంబంధం అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: పరస్పర అంగీకారంతో కొనసాగిన శారీరక సంబంధాన్ని బంధం విఫలమైన తర్వాత అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రేమ సంబంధం లేదా వివాహ బంధం కొనసాగిన సమయంలో ఇరువురి అంగీకారంతో జరిగిన శారీరక సాన్నిహిత్యాన్ని అత్యాచారంగా పేర్కొనలేమని తేల్చి చెప్పింది. బంధం ముగిసిందన్న కారణంతో దానిని నేరంగా మార్చడం సరికాదని అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. కేరళకు చెందిన సంతోశ్ కుమార్ అనే వ్యక్తిపై నమోదైన అత్యాచారం, మోసం కేసు నుంచి అతనికి విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరువురి మధ్య బంధం సజావుగా కొనసాగుతున్న సమయంలో జరిగిన శారీరక సాన్నిహిత్యాన్ని, ఆ బంధం ముగిసిన తర్వాత అత్యాచారంగా చిత్రీకరించడం చట్టపరంగా సమర్థనీయం కాదని పేర్కొంది. కేవలం సంబంధం విఫలమైందనే కారణంతో గతంలో ఇచ్చిన అంగీకారాన్ని నేరంగా పరిగణించలేమని తెలిపింది. మొదటి నుంచే మోసం చేసి, తప్పుడు హామీలతో శారీరక బంధానికి అంగీకారం పొందిన సందర్భాలను ఇలాంటి కేసులతో పోల్చకూడదని స్పష్టం చేసింది. బలవంతం, లైంగిక హింస, అంగీకారాన్ని మోసపూరితంగా పొందడం వంటి అంశాలు ఉంటే వాటిని తీవ్రంగా పరిగణించాల్సిందేనని స్పష్టం చేసింది.


సంబంధాలు విఫలమైన ప్రతిసారీ క్రిమినల్ కేసులు నమోదు చేయడం వల్ల అత్యాచారం వంటి తీవ్రమైన నేరాల ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ఉందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ తీర్పు ద్వారా పరస్పర అంగీకార సంబంధాలు, నిజమైన లైంగిక నేరాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని గుర్తించాలని సుప్రీంకోర్టు సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ఎవరికీ రాని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ..

పూలు కోస్తూ 23వ అంతస్తు నుంచి పడి తండ్రీకొడుకు మృతి

Updated Date - Oct 30 , 2026 | 05:39 PM