అసెంబ్లీని మరో వారం పొడిగించాలి: హరీష్ రావు
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:20 PM
అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో హామీలు నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ, నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చిట్‌చాట్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తల్లకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని, రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డికి సవాల్
దమ్ముంటే సిద్దిపేటలో తనపై పోటీ చేయాలంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, రైతులు సహా అన్ని వర్గాలను రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. డీలిమిటేషన్ వల్ల బీఆర్ఎస్‌కు మేలు జరుగుతుందని, మహిళా రిజర్వేషన్లను తమ పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు. కుటుంబ నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక, రాజకీయ నష్టం జరుగుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.
కేవలం 16వేల ఉద్యోగాలే..
ఇక ఉద్యోగాల అంశంపై మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని వ్యాఖ్యనించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, మొత్తం 16 నోటిఫికేషన్లు మాత్రమే విడుదల చేశారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు.
17 బోర్డులకు ఆఫీసులు కూడా లేవు
సంక్షేమ బోర్డుల పరిస్థితిపై కూడా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 33 సంక్షేమ బోర్డులు ఉన్నప్పటికీ, వాటిలో 16కి మాత్రమే కార్యాలయాలు ఉన్నాయని, మిగిలిన 17 బోర్డులకు కార్యాలయాలు కూడా లేవని తెలిపారు. కార్పోరేషన్లకు కేటాయించిన నిధుల్లో 99 శాతం లాప్స్ అవుతున్నాయని, కేవలం 2 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
మరో వారం పొడిగించాలి
అసెంబ్లీ నిర్వహణపై కూడా ఆయన విమర్శలు చేశారు. సభను సమయానికి ప్రారంభించడం లేదని, టీ బ్రేక్ పేరుతో గంటల తరబడి వాయిదాలు వేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి రావడం, మంత్రుల సిద్ధత వంటి కారణాలతో సభను తరచుగా వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష గొంతును నొక్కుతున్నారని ఆరోపించిన హరీష్, అసెంబ్లీని మరో వారం రోజుల పాటు పొడిగించాలని డిమాండ్ చేశారు.
Also Read:
ఆ ఇళ్లను కొత్త వారికి ఇస్తాం: మంత్రి పొంగులేటి
తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ.. ఎవరేమన్నారంటే..
For More Latest News