తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ.. ఎవరేమన్నారంటే..
ABN , Publish Date - Mar 25 , 2026 | 01:26 PM
99 రోజుల ప్రణాళికలో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కేటాయిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బుధవారం అసెంబీలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ జరిగింది.
హైదరాబాద్, మార్చి 25: 99 రోజుల ప్రణాళికలో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కేటాయిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బుధవారం అసెంబీలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎన్ని ఉన్నాయి? వాటిలో ఎన్ని పూర్తయ్యాయి? ఇంకా ఎన్ని పూర్తి కావాల్సి ఉందనే దానిపై తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఇంతలో ఎమ్మెల్యే కె. వెంకటరమణా రెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇందిరమ్మ ఇల్లు మంచి పథకమన్నారు.
వీటి వల్ల పేదలకు లబ్ది జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇల్లు నాసిరకంగా ఉండడంతో శిథిలావస్థకు చేరాయని విమర్శించారు. ఇప్పటికే పూర్తయి ఎవరికి కేటాయించని డబుల్ బెడ్ రూం ఇళ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి జోక్యం లేకుండా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
గ్రేటర్‌లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారు: ఎమ్మెల్యే దానం
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. ఇప్పటికే పూర్తయి.. ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వీలైనంత త్వరగా లబ్దిదారులకు అందజేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఖైరతాబాద్‌లో 5 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టేందుకు శంకుస్థాపన చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీఆర్ఎస్ హయాంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించిందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. చిన్న చిన్న రిపేర్ల కారణంగా వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇంకా లబ్దిదారులకు అందజేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీని దృష్టిలో పెట్టుకుని డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీలు చెప్పే వారికే ఇళ్లు ఇస్తామంటున్నారని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
అల్లుడు వస్తే ఏడుంటడు, బిడ్డ వస్తే ఏడుంటడు: ఎమ్మెల్యే వంశీ కృష్ణ
అల్లుడు వస్తే ఏడుంటడు, బిడ్డ వస్తే ఏడుంటడు అని గతంలో మాట్లాడిన కేసీఆర్.. గత పదేళ్ళలో అసలైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలేదని బీఆర్ఎస్ అధినేతపై ఎమ్మెల్యే వంశీ కృష్ణ మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు సైతం కాలం చెల్లడంతో అవి శిథిలావస్థకు చేరాయని పేర్కొన్నారు. వారికి సైతం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. జాయింట్ ఫ్యామిలీని రీ ఎంక్వరీ చేసి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వానికి ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది కేటాయించిన ఇళ్లకు నిధులు ఎలా?: ఎమ్మెల్యే పల్లా
ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్‌లో రూ. 5 వేల కోట్లు కేటాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇంకా పూర్తి కాని వాటికే ఈ రూ.5 వేల కోట్లు సరిపోవని చెప్పారు. వచ్చే ఏడాది కేటాయించిన ఇళ్లకు నిధులు ఎలా ఇస్తారంటూ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇంతలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని.. పల్లా రాజేశ్వర్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గానికి నాలుగున్నర లక్షల ఇళ్లు అన్ని పల్లా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
నియోజకవర్గానికి అన్ని ఇళ్లు ఉంటాయా అంటూ సందేహం వ్యక్తం చేశారు. సభను పక్కదారి పట్టించడమే ఏజెండాగా పెట్టుకున్నారని పల్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం పెట్టిన బడ్జెట్‌ను బీఆర్ఎస్ విమర్శిస్తుందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. బడ్జెట్ పుస్తకాలను చించి పేదలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానించారంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రెండో రోజు సిట్ కస్టడీకి మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు నిందితులు
యుద్ధం ఎఫెక్ట్.. మూతబడుతున్న పెట్రోల్ బంక్‌లు
For More TG News And Telugu News