Share News

ఆ ఇళ్లను కొత్త వారికి ఇస్తాం: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Mar 25 , 2026 | 02:03 PM

రాష్ట్రంలో గృహ నిర్మాణ పనులపై శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.

ఆ ఇళ్లను కొత్త వారికి ఇస్తాం: మంత్రి పొంగులేటి
Ponguleti Srinivasa Reddy

హైదరాబాద్‌: శాసనసభ సమావేశాల్లో గృహ నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష చేపట్టి, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం ద్వారా భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపట్టిందని మంత్రి గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 21 లక్షల ఇళ్లు నిర్మించారని తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఇళ్లకు అనుమతులు ఇచ్చిందని చెప్పారు. అయితే, ఆ ఇళ్లలో అనేక పనులు పూర్తి కాలేదని మంత్రి వెల్లడించారు. సుమారు 70 వేల ఇళ్లలో చిన్నపాటి పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, మరో 26 వేల ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. ఈ అసంపూర్తి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు.


ఇక గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో 12 వేల ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులు ఆక్యూపై చేయలేదని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు మూడు నెలల గడువు ఇచ్చి నోటీసులు జారీ చేయగా, అందులో 6 వేల మంది ఇళ్లను ఆక్యూపై చేసుకున్నారని చెప్పారు. మిగిలిన ఇళ్లను అర్హులైన కొత్త లబ్ధిదారులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అలాగే, పూర్తి కాకుండా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎంత ఖర్చు అయినా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల అంశంపై అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో కలిసి త్వరలో హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News

Updated Date - Mar 25 , 2026 | 02:08 PM