పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. భయపడకండి: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:07 PM
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు.
హైదరాబాద్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, అవసరానికి సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు.
రెండు నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ స్టాక్ రాష్ట్రంలో ఉందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తోందని, అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. సివిల్ సప్లై శాఖ మొత్తం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని తెలిపారు. ప్రజలు రూమర్స్, ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. ముఖ్యంగా డ్రమ్స్, కంటైనర్లలో పెద్ద ఎత్తున ఇంధనం నిల్వ చేయడం చట్ట విరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇక, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇంధన డిమాండ్ సుమారు 25 శాతం పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు 1200 ట్యాంకర్ల ద్వారా సరఫరా జరుగుతోందని చెప్పారు. పెట్రోల్ బంక్‌లు అనవసరంగా మూసివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అహ్మదాబాద్, సూరత్, నాగపూర్, చెన్నై వంటి నగరాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే బంక్‌లకు ఎలాంటి క్రెడిట్ సమస్యలు లేవని, సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
Also Read:
పొత్తు పెట్టుకుంటే తప్పేంటి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టాడు: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
For More Telangana News