Share News

కార్యకర్తను చంపితే సీఎం కనీసం ఫోన్ చేయలేదు: జీవన్ రెడ్డి

ABN , Publish Date - Mar 25 , 2026 | 01:49 PM

మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలిపై ఎన్నడూ లేనంతగా నిప్పులు చెరిగారు.

కార్యకర్తను చంపితే సీఎం కనీసం ఫోన్ చేయలేదు: జీవన్ రెడ్డి
Telangana Congress News

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలిపై ఎన్నడూ లేనంతగా నిప్పులు చెరిగారు. ‘ఆత్మ గౌరవం లేని చోట ఉండలేను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నేను గతంలోనే చంద్రబాబు, కేసీఆర్ వంటి ఉద్దండులతో కొట్లాడిన. ఇప్పుడు రేవంత్ రెడ్డితో కొట్లాడటం నాకు కొత్తేమీ కాదు. రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తే వాడివి నేను కాదు. చంద్రబాబు, కేసీఆర్‌పై పోరాటం చేసిన నేను.. ఇక నుంచి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా. బతుకు దెరువు కోసం వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి సలహాదారు పదవి ఇస్తారా? ఇంకా ఎంత కాలం అవమానాలు? కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఎదగొద్దని రేవంత్ ఇదంతా చేస్తున్నారు. రాహూల్ గాంధీ మాట ప్రకారం నడిచే నన్ను అణగదొక్కుతారా? అసలు ఎవరీ వేం నరేందర్ రెడ్డి?. సీనియర్ నేత చిన్నారెడ్డిని ఆత్మహత్య చేసుకునే స్థాయికి దిగ జార్చారు. నిజానికి నేను పీసీసీ చీఫ్ కావాల్సింది.. కానీ, రేవంత్ కుటిల రాజకీయాలు చేసి సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చక్రం తిప్పారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయంలో నన్ను పక్కన పెట్టారు. మరి అక్కడ గెలిచారా? సొంత నియోజకవర్గంలో హక్కుల కోసం కూడా కొట్లాడాల్సిన దుస్థితి ఏర్పడింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘నా అనుచరుడు గంగారెడ్డిని చంపినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఫోన్ చేసి పరామర్శించలేదు. కార్యకర్తలకు రక్షణ లేనప్పుడు, కనీస గౌరవం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకు. పార్టీలో నా ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించారు. గతంలో హైకమాండ్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. నేను సిఫార్సు చేసిన నామినేటెడ్ పదవులను కావాలనే పెండింగ్‌లో పెట్టారు. అధిష్ఠానం పెద్దలు కె.సి.వేణుగోపాల్ ఇచ్చిన హామీలను సైతం పక్కన పెట్టిన తర్వాత ఇక పార్టీలో కొనసాగాల్సిన అవసరం ఏముంది?. గాంధీ భవన్‌లో ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు అగ్రతాంబూలం ఇవ్వడమే కాకుండా, వాళ్లకు సీట్లు కూడా కేటాయించారు. దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేయించి, ఆ తర్వాత ఎంపీగా పోటీ చేయిస్తే సరిపోయేది. అలా చేయకుండా పార్టీ ప్రతిష్టను దిగ జార్చారు’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఆధునిక బస్టాండ్లు, టెర్మినళ్లు

నేటి నుంచి భగభగలే!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 25 , 2026 | 02:20 PM