Share News

ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఆధునిక బస్టాండ్లు, టెర్మినళ్లు

ABN , Publish Date - Mar 25 , 2026 | 07:32 AM

నగరం ట్రాఫిక్‌ మయంగా మారుతోంది. జిల్లాల నుంచి నగరానికి వస్తున్న ప్రయాణికుల సంఖ్య మహాలక్ష్మి ఉచిత ప్రయాణికులతో భారీగా పెరిగింది.

ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఆధునిక బస్టాండ్లు, టెర్మినళ్లు

  • ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు

హైదరాబాద్‌ సిటీ: నగరం ట్రాఫిక్‌ మయంగా మారుతోంది. జిల్లాల నుంచి నగరానికి వస్తున్న ప్రయాణికుల సంఖ్య మహాలక్ష్మి ఉచిత ప్రయాణికులతో భారీగా పెరిగింది. జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులు మహాత్మాగాంధీ, జూబ్లీ బస్టాండ్లకు ట్రాఫిక్‌లో చేరేందుకు గంట నుంచి 2 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా నగరం నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణం సాఫీగా సాగేలా ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఆధునిక బస్టాండ్లు, టెర్మినళ్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఈ ప్రాంతాల్లో బస్టాండ్లు

శంషాబాద్‌ పరిసరాల్లో భారీ బస్టాండ్‌, టెర్మినల్‌ నిర్మాణంతో పాటు ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, ఆరంఘర్‌, లింగంపల్లి వంటి ప్రాంతాల్లో ఆధునిక తరహా బస్టాండ్ల ఏర్పాటు అంశాలను పరిశీలిస్తోంది. ఉప్పల్‌/ కీసర ప్రాంతంలో కొత్తగా బస్టాండ్‌ ఏర్పాటయితే వరంగల్‌ రూట్‌లో వెళ్లే ప్రయాణికులు అక్కడ నుంచే ప్రయాణాలు సాగించే అవకాశాలుంటాయి. ఎల్‌బీనగర్‌ నుంచి విజయవాడ, నల్గొండ(Vijayawada, Nalgonda) సెక్టార్‌, ఆరంఘర్‌లో బస్టాండ్‌ అందుబాటులోకి తీసుకువస్తే మహబూబ్‌నగర్‌, కర్నూల్‌, బెంగుళూర్‌ మార్గంలో వెళ్లే ప్రయాణికులు సులభంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. లింగంపల్లి ప్రాంతంలో బస్టాండ్‌ ఏర్పాటైతే సంగారెడ్డి, జహీరాబాద్‌, పుణే రూట్లలో వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశాలుంటాయి.


city3.jpgరోజూ 6 వేలకు పైగా బస్సుల రాకపోకలు

తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రతి రోజూ నగరానికి 6వేలకు పైగా బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రధానంగా ఎంజీబీఎస్‌ నుంచి 4 వేల బస్సులు, జేబీఎస్‌ నుంచి 1200కు పైగా జిల్లాల సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రధాన బస్టాండ్లయిన ఎంజీబీఎస్‌, జేబీఎస్‏ల నుంచి రోజు 2.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. శివారు ప్రాంతాల్లో బస్టాండ్లు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా నగరానికి వచ్చే జిల్లా సర్వీసులను ఎక్కడికక్కడే పరిమితం చేసుకోవచ్చని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నేటి నుంచి భగభగలే!

941 కోట్లతో డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Mar 25 , 2026 | 07:56 AM