Share News

941 కోట్లతో డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:52 AM

హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌ నుంచి హయత్‌ నగర్‌ దాకా నాగ్‌పూర్‌ తరహాలో డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

941 కోట్లతో డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌

  • నాగ్‌పూర్‌ తరహాలో ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ మధ్య నిర్మాణం

  • కింద సర్వీస్‌ రోడ్డు,మధ్యలో హైవే, పైన మెట్రో

  • నెలలో కేంద్రం ఆమోదం తీసుకుంటాం

  • 6 నెలల్లో పనులు ప్రారంభించేలా చర్యలు

  • మట్టి రోడ్లన్నీ బీటీ రోడ్లుగా మారుస్తాం

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌ నుంచి హయత్‌ నగర్‌ దాకా నాగ్‌పూర్‌ తరహాలో డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రూ.941 కోట్లతో నిర్మించే ఈ ఫ్లై ఓవర్‌కు నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదం తీసుకుంటామని చెప్పారు. ఆర్నెల్లలో టెండర్లు ఖరారు చేసి, పనులు మొదలయ్యేలా చూస్తామన్నారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. హైదరాబాద్‌-విజయవాడ ప్రయాణ సమయం రెండున్నర గంటల్లోపునకు తగ్గించేందుకు, ఎల్బీ నగర్‌ నుంచి హయత్‌ నగర్‌ మధ్య ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఈ ఫ్లై ఓవర్‌ ముఖ్యమన్నారు. ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ మధ్య 65కిపైగా కాలనీల్లో 10-12 లక్షల జనాభా నివసిస్తోందని, ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఈ రెండు ప్రాంతాల మధ్య పరిమిత క్రాసింగ్‌ పాయింట్లు ఉండటం వల్ల ప్రజలు అదనంగా 2.2 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోందన్నారు. నాగ్‌పూర్‌లో 5.6 కి.మీ. పొడవునా కింది భాగంలో సర్వీసు రోడ్డు, మధ్యలో జాతీయ రహదారి, పై భాగంలో మెట్రో రైలు సదుపాయం కల్పించారని, అదే తరహాలో ఇక్కడ 5.5 కి.మీ. పొడవునా డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి ప్రతిపాదించామని తెలిపారు. దీని అంచనా వ్యయం రూ.941 కోట్లు కాగా, కేంద్రం రూ.741 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు భరిస్తాయని చెప్పారు. ఎల్బీ నగర్‌ నుంచి మల్కాపూర్‌ వరకు ఆరు లేన్లుగా జాతీయ రహదారి-65 విస్తరణ పనులు సుమారు 80 శాతం మేర పూర్తయ్యాయన్నారు. హైదరాబాద్‌-శ్రీశైలం రహదారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. మన్ననూరు వరకు ఇప్పటికే ఆరు లేన్ల రహదారి అభివృద్ధి చేపట్టగా, మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు సుమారు 52 కి.మీ. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దీని అంచనా వ్యయం సుమారు రూ.7,600 కోట్లు అని, ఆమోదం కోసం కేంద్రానికి పంపినట్లు తెలిపారు. రాష్ట్రంలో మట్టి రోడ్లు లేకుండా అన్నీ బీటీ రోడ్లు వేస్తామన్నారు. తొలి దశలో రూ.13 వేల కోట్లతో 6092 కి.మీ. మేర ఆర్‌ అండ్‌ బీ రోడ్ల నిర్మాణం చేపడతామని, ప్రస్తుతం 24 ప్యాకేజీలకు టెండర్లు స్వీకరించి, పరిశీలిస్తున్నారని, మరో 10 ప్యాకేజీలకు వారంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు.


మేలో హ్యామ్‌ రోడ్ల పనులు ప్రారంభం!

రాష్ట్రంలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌(హ్యామ్‌) విధానంలో చేపట్టే రోడ్ల పనులకు ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ నెలాఖరకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాంట్రాక్టర్లు లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌లు, బ్యాంకు రుణాలు సమకూర్చుకోవడం మే మొదటి వారానికి పూర్తవుతాయని భావిస్తున్నారు. దీని ప్రకారం మే మూడో వారం నుంచి ఆర్‌ అండ్‌ బీ శాఖ పరిధిలోని హ్యామ్‌ రోడ్ల పనులు ప్యాకేజీల వారీగా ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. రెండు దశల్లో కలిపి రూ.12,063.43 కోట్లతో 6,092 కి.మీ. మేర ఈ రోడ్లు నిర్మించనున్నారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నియోజకవర్గం మధిరకు 13 కి.మీ. నిడివితో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మించనున్నారు. దీనికి దాదాపు రూ.188.76 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచారు.

Updated Date - Mar 25 , 2026 | 04:52 AM