పెద్దిరెడ్డి అనుచరుల చేతివాటం
ABN , Publish Date - Mar 25 , 2026 | 06:16 AM
వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, అనుకూలంగా వ్యవహరించిన అధికారులు పెద్దఎత్తున భూఅక్రమాలకు పాల్పడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో...
చిత్తూరులో ఏడెకరాలు స్వాహా
రీసర్వే సమయంలో నలుగురి పేరుతో రూ.15 కోట్ల భూమి బదలాయింపు
కుటుంబ సభ్యులు, అత్త,పెద్దిరెడ్డి గన్‌మన్ భార్య పేరిట ఆన్‌లైన్
తాజాగా గుర్తించిన అధికారులు
చిత్తూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, అనుకూలంగా వ్యవహరించిన అధికారులు పెద్దఎత్తున భూఅక్రమాలకు పాల్పడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో ఏకంగా 918 ఎకరాల ప్రభుత్వ అనాధీన భూమికి పట్టాలు చేసుకున్న విషయం కూటమి అధికారంలోకి వచ్చాక వెలుగులోకి వచ్చింది. తాజాగా పెద్దిరెడ్డి అనుచరులు జిల్లా కేంద్రం చిత్తూరులో చేసిన భూకుంభకోణం బయటపడింది. ఆయన ముఖ్య అనుచరుడైన ఓ కాంట్రాక్టు సర్వేయరు.. మరో సచివాలయ సర్వేయరుతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. ఇద్దరూ తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో పాటు పెద్దిరెడ్డి గన్‌మన్ భార్య పేరుతో కూడా ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్ చేశారు. రీసర్వే సమయంలో మొత్తం రూ.15 కోట్ల విలువ చేసే 7.15 ఎకరాలను ఆన్‌లైన్‌లో తమ బంధుమిత్రుల పేరిట బదలాయించుకున్నట్లు రెవెన్యూ అధికారులు తాజాగా గుర్తించారు. వాటి బదలాయింపును రద్దుచేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నగరంలో జిల్లా పోలీసు కార్యాలయం, పోలీసు ట్రైనింగ్ సెంటర్ సమీపంలో విలువైన ప్రభుత్వ భూములున్నాయి. 2022లో రీసర్వే జరిగినప్పుడు వీటిపై వైసీపీ నాయకుల కన్ను పడింది. యాదమరి మండలంలో కాంట్రాక్టు సర్వేయర్‌గా పనిచేసిన ప్రేమ్‌కుమార్, జంగాలపల్లె సచివాలయ సర్వేయర్‌గా పనిచేసిన వినోద్‌కుమార్ కలిసి తమ కుటుంబ సభ్యుల పేర్లతో పాటు వైసీపీ సానుభూతిపరుల పేర్ల మీదా సదరు భూములను ఆన్‌లైన్‌లోకి ఎక్కించారు.
ఎవరి పేరుతో ఎంత..
యాదమరి మండలంలో సుదీర్ఘంగా పనిచేసిన కాంట్రాక్టు సర్వేయర్ ప్రేమ్‌కుమార్.. పెద్దిరెడ్డి అనుచరుడు. ఈ అక్రమాల్లో కీలక పాత్ర ఈయనదేనని తెలుస్తోంది. ఈయన తన భార్య సల్మా పేరుతో 355/3 సర్వే నంబరులోని (786 ఎల్పీఎం) 1.79 ఎకరాలను ఆన్‌లైన్ చేయించారు. లోకల్ విలేజ్ సర్వేయర్ వినోద్‌కుమార్ తన అత్త (భార్య అమ్మ) గులాబ్‌జాన్ పేరుతో 355/4 సర్వే నంబరులోని (990ఎల్పీఎం) 1.66 ఎకరాలు నమోదు చేయించుకున్నారు. సచివాలయ సర్వేయర్ల సంఘం మండల నేతగా ఉన్న వినోద్‌కుమార్ ప్రస్తుతం మాదిరెడ్డి సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరికీ దగ్గరి వ్యక్తి చంద్రశేఖర్. ఈయన భార్య రూప పేరుతో కూడా 355/5 సర్వే నంబరులోని (1095ఎల్పీఎం) 1.26 ఎకరాలను ఆన్‌లైన్‌లోకి ఎక్కించారు. పెద్దిరెడ్డికి గన్‌మన్‌గా పనిచేసిన భాస్కర్‌రెడ్డి భార్య కుమారి పేరి టా 355/2సర్వేలోని (1297ఎల్పీఎం) 2.44ఎకరాలనుబదలాయించుకున్నారు. ఈ భాస్కర్‌రెడ్డికి ప్రేమ్‌కుమార్ సన్నిహితుడు.
ఎకరా రూ.2 కోట్లపైనే
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండడం.. జిల్లా పోలీసు, రవాణా శాఖ కార్యాలయాలకు, జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు సమీపంలో ఉండడంతో ఇక్కడ భూమి విలువ భారీగా ఉంది. ఎకరా రూ.2 కోట్లపైనే ఉంటుందని రెవెన్యూ అధికారుల అంచనా. మొత్తం 7.15 ఎకరాల విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.
వైసీపీ వీరాభిమాని..
ప్రేమ్‌కుమార్ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ యాదమరి మండలంలోనే పనిచేశారు. అంతకుముందు కూడా అక్కడే నాలుగేళ్ల పాటు చేశారు. వైసీపీకి వీరాభిమాని. ప్రభుత్వ సర్వేయర్ కన్నా ఈయన పెత్తనమే ఎక్కువ. సర్వే చేయాలంటే ఎకరాకు రూ.5 వేలు వసూలు చేసేవాడని.. మండలంలో రెవెన్యూ వివాదాలు సృష్టించి, డబ్బులు తీసుకుని పరిష్కరించేవాడని ఆరోపణలున్నాయి. ఈయన భార్య సల్మా చిత్తూరులో 34వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్‌గా పనిచేశారు.
అప్పటి తహశీల్దార్ ఇప్పుడు కుప్పంలో..
సాధారణంగా భూములను ఆన్‌లైన్ చేయాలంటే తహశీల్దార్ డిజిటల్ కీ తప్పనిసరి. అప్పట్లో యాదమరి తహశీల్దార్‌గా పనిచేసిన చిట్టిబాబుకు తెలియకుండా ఈ భూములను ఆన్‌లైన్‌లో బదలాయించే అవకాశం లేదు. ప్రస్తుతం ఆయన సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మండలంలో తహశీల్దార్‌గా పనిచేస్తున్నారు.