Share News

సింగూరు ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటి: హరీశ్ రావు

ABN , Publish Date - Oct 12 , 2026 | 03:00 PM

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు వేయొద్దంటే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

సింగూరు ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటి: హరీశ్ రావు
Harish Rao

హైదరాబాద్, అక్టోబర్ 12: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడానికి కాంగ్రెస్‌కు మనసు లేదని మండిపడ్డారు. పంటలు వేయొద్దంటే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతు కూలీలు ఎలా బతకాలి.. వలసలు పోవాలా అని నిలదీశారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వలసలు వాపస్ వచ్చాయని.. ఇప్పుడు మళ్లీ వలసలు మొదలయ్యాయని విమర్శించారు.


రైతులు డీజిల్ ఇంజిన్‌లు పెట్టుకుని పంటలను కాపాడుకుంటున్నారని.. ప్రతి దానికీ ఎల్‌నినోతో లింక్ పెడుతున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. బొగ్గు లేదంటే కూడా ఎల్‌నినో అంటున్నారన్నారు. సర్కార్ నిర్లక్ష్యం వల్లే రాష్టానికి ఈ పరిస్థితి వచ్చిందని విరుచుకుపడ్డారు. దేవాదులలో మోటార్లు ఎందుకు నడపడం లేదని ప్రశ్నించారు. సింగూరు ప్రాజెక్ట్‌లో వాడుకునేందుకు రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉందని తెలిపారు. ఆ నీళ్లను కూడా బీర్ల కంపెనీలకు ఇస్తున్నారని ఆరోపించారు. దసరా లిక్కర్‌కు షార్టేజ్ రావొద్దని వాళ్లకు నీళ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యమని ప్రశ్నించారు. సింగూరుపై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటని ప్రశ్నించారు.


పంటల కోసం జూరాల గేట్లు తెరిస్తే రైతులను జైలుకు పంపారని.. తాగునీరు ఇవ్వకుండా బీర్ల కంపెనీలకు నీళ్లు ఇస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కూడా కేసులు పెట్టాలని హరీశ్ డిమాండ్ చేశారు. నీళ్లుండి కూడా ఎత్తని ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. రైతులతో గంట సేపు మాట్లాడే సమయం ముఖ్యమంత్రికి లేదా అంటూ ప్రశ్నించారు. బీర్ల కంపెనీలకు నీళ్లు, ఢిల్లీలో రాజకీయాలు తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకో పని లేదని హరీశ్ రావు విమర్శించారు.


ఇవి కూడా చదవండి...

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష

‘ఫసల్ బీమా అమలు చేయాల్సిందే’.. రేవంత్ సర్కార్‌కు రాంచందర్ హెచ్చరిక

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 04:48 PM