విజయవాడలో రెండు రోజులపాటు పర్యటించనున్న రాష్ట్రపతి..
ABN , Publish Date - Oct 12 , 2026 | 01:44 PM
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ఆమె దర్శించుకోనున్నారు. అలాగే, పున్నమి ఘాట్‌లో నిర్వహించే సరస్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
అమరావతి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ఆమె దర్శించుకోనున్నారు. అలాగే, పున్నమి ఘాట్‌లో నిర్వహించే సరస్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టడంతో పాటు పటిష్ట భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.
అక్టోబర్ 14న కనకదుర్గమ్మ దర్శనం..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 14న సాయంత్రం 6:25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఆమె విజయవాడలోని ఇంద్రకీలాద్రికి వెళ్లి రాత్రి 7:20 గంటలకు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రోటోకాల్ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
15న సరస్ మేళాకు ముఖ్య అతిథిగా..
అక్టోబర్ 15న విజయవాడలోని పున్నమి ఘాట్‌లో నిర్వహించే సరస్ మేళాలో రాష్ట్రపతి పాల్గొంటారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, లఖ్‌పతి దీదీలతో నిర్వహించే విందు కార్యక్రమానికి హాజరవుతారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి, గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలపై చర్చించేందుకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. రెండు రోజుల విజయవాడ పర్యటనను ముగించుకున్న అనంతరం ద్రౌపది ముర్ము అక్టోబర్ 15న మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
సీఎస్ సమీక్ష..
కాగా, రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ప్రోటోకాల్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రత, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, వేదికల వద్ద ఏర్పాట్లు, అధికారుల విధుల కేటాయింపు వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
పల్లిపాలెం హార్బర్‌లో భారీ మగ కచిడి చేప.. రూ.80 వేలకు దక్కించుకున్న వ్యాపారి..
విశాఖలో గ్యాస్ సిలిండర్‌కు నిప్పు.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్ర గాయాలు