పల్లిపాలెం హార్బర్‌లో భారీ మగ కచిడి చేప.. రూ.80 వేలకు దక్కించుకున్న వ్యాపారి..
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:19 PM
బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారులకు అరుదైన చేప దొరికింది. సముద్రంలో వేటకు వెళ్లిన వారి వలకు భారీ మగ కచిడి చేప చిక్కింది. దీని బరువు సుమారు 24 కిలోలు ఉండగా.. మినీ ఫిషింగ్ హార్బర్‌లో వేలం వేశారు.
బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా: సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారులకు అరుదైన చేప దొరికింది. సముద్రంలో వేటకు వెళ్లిన వారి వలకు భారీ మగ కచిడి (గోల్డెన్ ఫిష్) చేప చిక్కింది. దీని బరువు సుమారు 24 కిలోలు ఉండగా.. మినీ ఫిషింగ్ హార్బర్‌లో వేలం వేశారు. నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రూ.80 వేలకు దీనిని దక్కించుకున్నాడు. అరుదుగా లభించే ఈ చేపకు భారీ ధర పలకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
కాగా, మత్స్యకారుల వలకు ఈ చేప చిక్కడంతో హార్బర్‌లో ఆసక్తి నెలకొంది. సాధారణంగా అరుదుగా లభించే కచిడి చేపలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మగ కచిడి చేపకు అధిక ధర పలకడానికి దాని పొట్ట భాగమే ప్రధాన కారణమని మత్స్యకారులు చెబుతున్నారు. అందుకే, విక్రయ ధరలో సుమారు మూడో వంతు చేపకు, మిగిలిన రెండొంతులు దాని పొట్ట భాగానికి విలువ ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ చేప పొట్ట భాగంతో శస్త్రచికిత్సల సమయంలో కుట్లు వేయడానికి ఉపయోగించే ధారాన్ని తయారు చేస్తారని మత్స్యరంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఈ కారణంగానే కచిడి చేప పొట్ట భాగానికి మంచి గిరాకీ ఉంటుందని వెల్లడించారు.
మరోవైపు, భారీ బరువున్న మగ కచిడి చేప వలకు చిక్కడం, వేలంలో రూ.80 వేల ధర పలకడం స్థానిక మత్స్యకారుల్లో సంతోషాన్ని నింపింది. ఇలాంటి అరుదైన చేపలు దొరికినప్పుడు ఆనందంతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఏపీ రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం.. కిలో రూ.49కే బీపీటీ సన్నాలు