Share News

బస్సులో భారీ దోపిడీ.. బంగారం, వజ్రాభరణాలు మాయం

ABN , Publish Date - Aug 28 , 2026 | 07:52 PM

హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో బస్సులో భారీ దోపిడీ జరిగింది. ప్రయాణికుడి బ్యాగ్‌లో భద్రపరిచిన బంగారు, వజ్రాభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.

బస్సులో భారీ దోపిడీ.. బంగారం, వజ్రాభరణాలు మాయం
Gachibowli Bus Theft

హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో బస్సులో భారీ దోపిడీ జరిగింది. ప్రయాణికుడి బ్యాగ్‌లో భద్రపరిచిన బంగారు, వజ్రాభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. బ్యాగ్ జిప్‌ను తెరిచి లోపల ఉన్న నగలను దొంగిలించిన అనంతరం ఏమీ జరగనట్లు బ్యాగ్‌ను తిరిగి పక్కన పెట్టినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొండాపూర్‌కు చెందిన మెకానికల్ ఇంజినీర్ సి. శ్రీధర్ బాబు తన భార్యతో కలిసి ఆల్విన్ ఎక్స్ రోడ్స్ నుంచి గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి అమరావతి బస్సు నంబర్ - 4219లో ప్రయాణించారు.


ఈ సమయంలో తమ వద్ద ఉన్న బ్యాగ్‌లో ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు తెలిపారు. ఈ చోరీకి గురైన వాటిలో ఒక అన్‌కట్ డైమండ్ నెక్లెస్, ఒక బంగారు గాజు, ఒక బంగారు కమ్మ ఉన్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలోనే దొంగతనం జరిగినట్లు అతను అనుమానిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. తమ వెనుక సీట్లలో ప్రయాణించిన వాజిద్ (42), జబీద్ (28)పై శ్రీధర్ బాబు అనుమానం వ్యక్తం చేశాడు. తన బ్యాగ్‌లోని నగలు కనిపించకపోవడంతో బస్సులో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుని పోలీసులకు వివరాలు అందించారు.


బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు బుకింగ్ ఐడీ ఆధారంగా ప్రయాణికుల వివరాలు, వారి కదలికలను ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే బస్సు మార్గంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విలువైన బంగారం, వజ్రాభరణాలు చోరీకి గురికావడంతో ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిందితులను గుర్తించి ఆభరణాలను రికవరీ చేసేందుకు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

భారత్ - అమెరికా రక్షణ రంగంలో మరో ముందడుగు

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 08:03 PM