గండిపేట భూకబ్జా కేసు.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు 14 రోజుల రిమాండ్
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:51 PM
గండిపేట భూకబ్జా కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను చంచల్‌గూడా జైలుకు తరలించారు.
హైదరాబాద్, జూన్6 (ఆంధ్రజ్యోతి): గండిపేట భూకబ్జా కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు (Bolla Brahmanaidu) ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను చంచల్‌గూడా జైలుకు తరలించారు. ఈ కేసు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులో అరెస్ట్..
కాగా, భూకబ్జా కేసులో నిందితుడిగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు తీసుకువచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో భాగంగా స్టేట్‌మెంట్ నమోదు చేసిన అధికారులు, ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
బొల్లా బ్రహ్మనాయుడిని నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తున్నారనే సమాచారం అందడంతో వైసీపీ కార్యకర్తలు, ఆయన అనుచరులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీస్ స్టేషన్‌లోకి ఎవరినీ అనుమతించలేదు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఉప్పరపల్లి కోర్టులో హాజరు..
నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి బొల్లా బ్రహ్మనాయుడిని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలు విన్న కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం చంచల్‌గూడా జైలుకు పంపించారు.
ఆరుకు చేరిన అరెస్టులు..
గండిపేట భూకబ్జా కేసులో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టుతో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరాయి. ఈ కేసులో మరికొంతమందిని కూడా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
భూకబ్జాకు సంబంధించిన పలు కోణాల్లో సైబరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. భూముల ఆక్రమణ, పత్రాల వ్యవహారం, సంబంధిత వ్యక్తుల పాత్ర వంటి అంశాలపై అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గండిపేట భూకబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అరెస్ట్, అనంతరం కోర్టు రిమాండ్ విధించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు
పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు: రాంచందర్ రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News