Share News

‘సర్’ ప్రక్రియపై విపక్షాల ప్రచారం అవాస్తవం: రాంచందర్‌రావు

ABN , Publish Date - Oct 06 , 2026 | 02:37 PM

బీజేపీ, ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని, అపోహలను వ్యాప్తి చేస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు

‘సర్’ ప్రక్రియపై విపక్షాల ప్రచారం అవాస్తవం: రాంచందర్‌రావు
Ramchander Rao

హైదరాబాద్, అక్టోబర్ 6: బీజేపీ, ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని, అపోహలను వ్యాప్తి చేస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఫారమ్-6, ఫారమ్-7లను ఏదో భూతంలా చూపిస్తూ ఓట్లు తొలగిస్తున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫారమ్-6 అనేది ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఉపయోగించే ప్రక్రియ మాత్రమే అని.. దీనిపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫారమ్-6, ఫారమ్-7 అంశాలపై ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన, వివరణాత్మక ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.


ముగ్గురు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీబీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. 2025 జూన్ 24న బిహార్‌లో చేపట్టిన SIR ప్రక్రియ ఎన్నికల సంఘం ఏకగ్రీవ నిర్ణయంతోనే జరిగిందన్నారు. SIRపై ఎన్నికల సంఘం తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు. ఎన్నికల సంఘంలో ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకోలేదనడం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారం మాత్రమే అని వెల్లడించారు. 2.8 కోట్ల మంది మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. మరి చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలా? వద్దా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్, సోనియా ఓటు చోరీతోనే ఎంపీలుగా గెలిచారా అని ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో ఓటు చోరీతోనే కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందా అని నిలదీశారు.


1952 నుంచి 2014 వరకు దేశంలో 12 సార్లు SIR జరిగిందని.. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని రాంచందర్‌ రావు అన్నారు. SIR తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ అక్రమ ప్రభుత్వాలేనని కాంగ్రెస్ ఇప్పుడు చెప్పగలదా అని అడిగారు. కాంగ్రెస్ గెలిస్తే ఎన్నికల సంఘం మంచిదంటుందని.. ఓడిపోతే ఎన్నికల సంఘం, EVMలపై ఆరోపణలు చేస్తుందని.. ఇదీ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అంటూ ఫైర్ అయ్యారు. ఈవీఎంలను ప్రవేశపెట్టింది కూడా రాజీవ్ గాంధీ ప్రభుత్వమే అని.. మరి రాహుల్ ఇప్పుడు తన తండ్రి తీసుకొచ్చిన విధానాన్నే తప్పుపడుతున్నారా అని ప్రశ్నించారు.


2018లో తెలంగాణలోనే అభిషేక్ మను సింఘ్వీ 70 లక్షల ఓటర్ల పేర్లలో అవకతవకలు ఉన్నాయని చెప్పారని బీజేపీ నేత గుర్తుచేశారు. 2018లోనే రాహుల్ గాంధీ ఫేక్, బోగస్, డూప్లికేట్ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారన్నారు. మధ్యప్రదేశ్‌లో 60 లక్షల ఫర్జీ ఓటర్లు ఉన్నారని కమల్‌నాథన్ గతంలో చెప్పారని, రాజస్థాన్‌లో 45 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని సచిన్ పైలట్ చెప్పారని తెలిపారు. 2018లో కాంగ్రెస్ చెప్పిన ఫేక్, బోగస్, డూప్లికేట్ ఓట్లను తొలగించే బాధ్యత ఎన్నికల సంఘానిది కాదా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. అప్పుడు నకిలీ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఓటరు జాబితా శుద్ధీకరణను ఎందుకు వ్యతిరేకిస్తోందని నిలదీశారు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ 13 కోట్ల ఓట్లు అక్రమంగా తొలగించారని మాట్లాడుతున్నారని.. దీనికి ఆధారాలు చూపాలన్నారు. ఓటరు జాబితా శుద్ధీకరణను రాజకీయ కుట్రగా చిత్రీకరించడం మానేసి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని రాంచందర్‌ రావు హితవుపలికారు.


ఇవి కూడా చదవండి..

బీసీ 34 శాతం రిజర్వేషన్లపై జగన్‌కు బుద్దా వెంకన్న హెచ్చరిక

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. ‘SIR’ ప్రక్రియ ఆపాలి: ఎంపీ చామల

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 02:47 PM