Share News

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్..

ABN , Publish Date - Jul 06 , 2026 | 07:55 PM

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో నమోదైన కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి  అరెస్ట్..
DSP Bheem Reddy

హైదరాబాద్, జులై 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీస్ శాఖలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు సంచలనం సృష్టించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో నమోదైన కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని (DSP Bheem Reddy) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈరోజు (సోమవారం) అరెస్ట్ చేశారు. ఇటీవల నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో ఆస్తులు బయటపడటంతో ఆయనపై ఏసీబీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు.


ఐదురోజుల క్రితం సోదాలు..

హైదరాబాద్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) విభాగంలో డీఎస్పీగా భీమ్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐదురోజుల క్రితం ఆయన నివాసం, కార్యాలయం, బంధువులు, బినామీలకు చెందిన 16 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల అనంతరం ఈ చర్యలు చేపట్టారు.

భారీగా అక్రమ ఆస్తులు

ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో భారీస్థాయిలో అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. భీమ్‌రెడ్డి సంపాదించిన అక్రమాస్తుల మార్కెట్ విలువ రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.


స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలిలా..

ఈ సోదాల సందర్భంగా సుమారు రెండు కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43.6 లక్షల నగదు, 23 విదేశీ మద్యం సీసాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మణికొండ, టెలికాం నగర్ ప్రాంతాలలో ఓపెన్ ప్లాట్లు, ఇబ్రహీంబాగ్‌లో ఒక లగ్జరీ విల్లా ఉన్నాయని సమాచారం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వందల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు తెలుస్తోంది.


వాచ్‌మన్, హోంగార్డుల పేర్లపై బినామీ ఆస్తులు..

ఈ దర్యాప్తులో అత్యంత షాకింగ్ అంశం ఏమిటంటే.. భీమ్‌రెడ్డి తన వద్ద గతంలో పనిచేసిన ఒక మాజీ హోంగార్డు, వాచ్‌మన్ పేర్లపై కోట్లాది రూపాయల విలువైన బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లీగల్ చిక్కుల నుంచి తప్పించుకోవడానికే ఇతరుల పేర్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బినామీ లావాదేవీలపై ఏసీబీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

కోర్టు రిమాండ్‌కు డీఎస్పీ..

సోదాల సమయంలో తీవ్ర ఒత్తిడి కారణంగా భీమ్‌రెడ్డి అనారోగ్యానికి గురికావడంతో చికిత్స అందించారు. కోలుకున్న అనంతరం అధికారులు ఆయనను అధికారికంగా అరెస్ట్ చేసి, కోర్టు అనుమతితో రిమాండ్‌కు తరలించారు. బ్యాంక్ లాకర్లు, డైరీలు, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తే ఈ కేసులో మరిన్ని ఆస్తులు, కీలకమైన ఆర్థిక లావాదేవీల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. డీఎస్పీ స్థాయి అధికారి ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులతో పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 06 , 2026 | 08:30 PM