ఎంపీలు సై... ప్రభుత్వాలు నై!
ABN , Publish Date - Nov 30 , 2026 | 03:43 AM
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. దక్షిణాదిన ఉన్న ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుపై దక్షిణాదిన విచిత్ర పరిస్థితి
ఈ రాష్ట్రాల నుంచి 58 శాతం ఎంపీల మద్దతు
ఏపీ మినహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ వ్యతిరేకం
డీఎంకే యూటర్న్ తీసుకోవటంతో గతానికి భిన్నంగా పరిస్థితి
హైదరాబాద్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. దక్షిణాదిన ఉన్న ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో ఈ రాష్ట్రాల్లోని మొత్తం 129 మంది ఎంపీల్లో 75 మంది (58 శాతం) మంది బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 ఎంపీల్లో ఎన్‌డీఏ కూటమికి 21, ప్రతిపక్ష వైసీపీకి నలుగురు ఉన్నారు. బిల్లుకు వైసీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించటంతో రాష్ట్రంలోని మొత్తం ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయనున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. అయితే, ఆ రాష్ట్రంలోని 28 మంది ఎంపీల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 9 మందే. వీరు బిల్లును వ్యతిరేకిస్తుంటే.. బీజేపీకి చెందిన 17 మంది, జేడీఎస్‌కు చెందిన ఇద్దరు మద్దతు ఇస్తున్నారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 8, ఎంఐఎంకు ఒక సీటు ఉన్నాయి. వీరిలో కాంగ్రెస్, ఎంఐఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఇక కేరళలోని యూడీఎఫ్ ప్రభుత్వం బిల్లును వ్యతిరేకిస్తోంది. ఆ రాష్ట్రంలోని 20 ఎంపీల్లో 18 మంది కాంగ్రెస్, ఒకరు సీపీఎం వారు ఉన్నారు. వీరు తమ పార్టీల వైఖరి మేరకు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఆ రాష్ట్రం నుంచి ఉన్న ఏకైక బీజేపీ ఎంపీ బిల్లుకు మద్దతు ఇవ్వనున్నారు. తమిళనాడుకు చెందిన డీఎంకే గతంలో బిల్లును వ్యతిరేకించగా.. తాజాగా మద్దతు ప్రకటించింది.
దీంతో రాష్ట్రంలోని మొత్తం 39 సీట్లలో డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు బిల్లుకు మద్దతు ఇవ్వనున్నారు. మిగిలిన 17 మంది బిల్లును వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులోని టీవీకే ప్రభుత్వం ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. మొత్తంగా ఈ రాష్ట్రాల్లోని 129 మంది ఎంపీల్లో టీడీపీ, బీజేపీ, డీఎంకే, జనసేన, వైసీపీ, జేడీఎస్ పార్టీలకు చెందిన 75 మంది బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు పెట్టినప్పుడు డీఎంకేతో కలిపి 59 శాతం మంది ఎంపీలు (76 మంది) దానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. 41 శాతం మంది (53 మంది) మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం డీఎంకే యూటర్న్ తీసుకోవడంతో మద్దతు 58 శాతానికి చేరగా.. వ్యతిరేకించేవారి బలం 42 శాతానికి పడిపోయింది.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!
స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్