అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!
ABN , Publish Date - Nov 28 , 2026 | 03:10 PM
అఫ్గానిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కునార్ ప్రావిన్స్‌లోని అందర్ సెర్ ప్రాంతంలో ఓ పాఠశాల వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మరణించగా.. మరో 97 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
కాబూల్, నవంబర్ 28: అఫ్గానిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కునార్ ప్రావిన్స్‌లోని అందర్ సెర్ ప్రాంతంలో ఓ పాఠశాల వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మరణించగా.. మరో 97 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇవాళ (శనివారం) ఉదయం సుమారు 10 గంటల సమయంలో విద్యార్థులంతా పాఠశాలలో ఉండగా.. పక్కనే ఉన్న ఇంట్లో పేలుడు సంభవించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై కునార్ ప్రావిన్షియల్ పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రతినిధి ఫరీద్ దెహ్కాన్ స్పందించారు. పేలుడు కారణంగా పలువురు విద్యార్థులు మరణించారని, మరికొందరు గాయపడినట్లు ఆయన వెల్లడించారు. పాఠశాల సమీపంలోని ఓ ఇంట్లో మైనింగ్ కార్యకలాపాలకు ఉపయోగించే డైనమైట్ను నిల్వ ఉంచినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తూ ఆ డైనమైట్లు పేలినట్లు అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ప్రమాదానికి ఇదే కారణమని అధికారులు ఇంకా నిర్ధారించలేదు.
పేలుడు అనంతరం ఘటనాస్థలికి సహాయక బృందాలు చేరుకున్నాయి. వెంటనే పలువురు విద్యార్థులను ఆస్పత్రికి తరలించాయి. మరోవైపు అధికారులు విచారణ చేపట్టారు. మృతుల సంఖ్య, వారి వివరాలు, పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. విచారణలో ప్రమాదానికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, భారీ పేలుడుతో పలువురు విద్యార్థులు మృతిచెందడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
ఈ వార్తలు కూడా చదవండి
వాషింగ్టన్ రీగన్ విమానాశ్రయంలో ఢీకొన్న రెండు విమానాల రెక్కలు.. వీడియో వైరల్
బురఖాతో ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడంపై ఇటలీలో ఆంక్షలు.. పార్లమెంటు ఆమోదం