Share News

బురఖాతో ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడంపై ఇటలీలో ఆంక్షలు.. పార్లమెంటు ఆమోదం

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:50 PM

ఇటలీలో బురఖా, నిఖాబ్‌లపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది. బురఖా, నిఖాబ్‌లతో ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడంపై ఇటలీ పార్లమెంటు ఆంక్షలు విధించింది.

బురఖాతో ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడంపై ఇటలీలో ఆంక్షలు.. పార్లమెంటు ఆమోదం

ఇంటర్నెట్ డెస్క్: ఇటలీలో బురఖా, నిఖాబ్‌లపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది. బురఖా, నిఖాబ్‌లతో ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడంపై ఇటలీ పార్లమెంటు ఆంక్షలు విధించింది. పాఠశాలల్లో నిర్వహించే కార్యక్రమాల సమయంలో విద్యార్థుల ముఖం స్పష్టంగా కనిపించాలని, వారి గుర్తింపును నిర్ధారించేందుకు వీలుగా ఉండాలని స్పష్టం చేసింది. ‘డిక్రీ స్కూలా’లో భాగంగా తీసుకొచ్చిన ఈ నిబంధనలకు ఇటలీ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న జారీ చేసిన డిక్రీ లా 170లో ఈ నిబంధనలను పొందుపరిచింది. దీనిపై నిర్వహించిన ఓటింగ్‌లో దిగువ సభలో 142 మంది సభ్యులు అనుకూలంగా, 112 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. నలుగురు తటస్థంగా ఉన్నారు. అనంతరం ఈనెల 20న సెనేట్ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.


కొత్త నిబంధనల ప్రకారం పాఠశాలల కార్యకలాపాల్లో పాల్గొనే విద్యార్థులు తమ ముఖాన్ని కప్పరాదు. ముఖాన్ని పూర్తిగా లేదా గుర్తింపును అడ్డుకునే బురఖా, నిఖాబ్‌లకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. అయితే తల (హెడ్), మెడను మాత్రమే కప్పి ముఖాన్ని కనిపించేలా ఉంచే హిజాబ్‌కు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. నిబంధనలను ఉల్లంఘిస్తే గరిష్టంగా వెయ్యి యూరోల వరకు జరిమానా విధించవచ్చు. విద్యార్థులు మైనర్లయితే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను బాధ్యులుగా చేస్తారు. పాఠశాలల్లో విద్యార్థుల గుర్తింపును సులభంగా నిర్ధారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇటలీ ప్రభుత్వం పేర్కొంది.


తరగతుల్లో విదేశీ విద్యార్థులకు 30 శాతం పరిమితి

డిక్రీ స్కూలా చట్టం ద్వారా పాఠశాల విద్యా విధానంలో మరికొన్ని మార్పులు కూడా తెచ్చారు. మొదటి సంవత్సరం తరగతుల్లో విదేశీ మూలాలున్న విద్యార్థుల సంఖ్యను 30 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించారు. అయితే ఇటాలియన్ భాషపై పరిజ్ఞానం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా, తమ పిల్లలు ఇటలీ విద్యావ్యవస్థలో కలిసిపోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విదేశీ తల్లిదండ్రులకు ఇటాలియన్ భాషా తరగతులు నిర్వహించనున్నారు.


విపక్షాల అభ్యంతరం

ప్రధాని జార్జియా మెలోని నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త సంస్కరణలను సమర్థిస్తోంది. విద్యా సంస్థల్లో విద్యార్థుల గుర్తింపు, సమైక్యత, సమాన అవకాశాల కల్పనకు తాము తీసుకున్న చర్యలు దోహదపడతాయని ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఫైవ్‌స్టార్‌ మూవ్‌మెంట్‌, డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన ప్రతిపక్ష సభ్యులు ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేక వర్గాల వారిపై వివక్ష చూపేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పాఠశాల భవనాల భద్రత, ఉపాధ్యాయుల వేతనాలు, విద్యా హక్కు వంటి సమస్యలపై దృష్టి సారించకుండా ప్రభుత్వం ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పూజ చేసి నీ కూతురి మనసు మార్చేస్తాం..!!

కాలేజీల సమీపంలోనే పరీక్షా కేంద్రాలు ఉండాలి

డీలిమిటేషన్‌పై ఇండియా కూటమి సమావేశం.. శరద్ పవార్ పార్టీ గైర్హాజరు

Updated Date - Nov 28 , 2026 | 01:50 PM