Share News

పూజ చేసి నీ కూతురి మనసు మార్చేస్తాం..!!

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:29 AM

కంటికి రెప్పలా పెంచుకున్న కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రిని.. ఓ ఆలయ పూజారి, అతని భార్య భారీ మోసం చేశారు.

పూజ చేసి నీ కూతురి మనసు మార్చేస్తాం..!!

  • పూజల పేరిట రూ.50 లక్షలకు మోసం

  • ఓ వ్యక్తికి పూజారి, ఆయన భార్య టోకరా

  • ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురిని ఇంటికి రప్పిస్తామని.. లేదంటే ఆమె పెళ్లాడిన వాడిని చంపేస్తామని చెప్పి వసూలు

  • కీసరలో ఘటన, ప్రధాన నిందితుడి అరెస్టు

కీసర రూరల్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): కంటికి రెప్పలా పెంచుకున్న కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రిని.. ఓ ఆలయ పూజారి, అతని భార్య భారీ మోసం చేశారు. అమ్మవారికి పూజలు చేసి నీ కూతురు మనసు మార్చేసి తిరిగి నీ ఇంటికి రప్పిస్తామని లేనిపక్షంలో ఆ యువతి పెళ్లాడిన వ్యక్తిని చంపేస్తామని మాయ చేసి రూ.50 లక్షలు వసూలు చేశారు. ఈ మోసానికి పాల్పడిన కీసరలోని కాళిమాత ఆలయ పూజారి కాళం క్రాంతి కుమార్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జవహర్‌నగర్‌ ఏసీపీ చక్రపాణి శుక్రవారం వెల్లడించారు.


ఆయన కథనం ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడ డివిజన్‌ కుందన్‌పల్లికి చెందిన మణికంఠ రాము కుమార్తె బ్రాహ్మణి ఈనెల 6న తడుము రాము అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మణికంఠ మానసిక ప్రశాంతత కోసం వివిధ ప్రదేశాలు తిరుగుతూ కీసరలోని కాళిమాత ఆలయానికి వెళ్లాడు. ఆ ఆలయ పూజారి క్రాంతికుమార్‌, అతని భార్య రత్న ఈ సందర్భంగా రాము పరిస్థితిని తెలుసుకున్నారు. కాళీమాతకు పూజలు చేస్తే.. ప్రేమ వివాహం చేసుకున్న కూతురి మనసు మారి ఇంటికి తిరిగొస్తుందని నమ్మించారు. లేనిపక్షంలో ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తిని అంతమొందిస్తామని హామీ ఇచ్చారు.


అందుకు కొంత డబ్బు ఖర్చు అవుతుందని నమ్మబలికారు. ఈ క్రమంలో పుట్టి సాయి అనే వ్యక్తితో కలిసి మణికంఠ నుంచి విడతల వారీగా రూ.50 లక్షలు వసూలు చేశారు. అంతేకాక, మణికంఠను రాంపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి తెల్ల కాగితంపై సంతకం చేయించుకొని అతని వద్ద ఉన్న ఏటీఎం కార్డులు తీసుకున్నారు. మొబైల్‌ ఫోన్‌(స్మార్ట్‌ ఫోన్‌), సిమ్‌ కార్డు ధ్వంసం చేశారు. కొత్త సిమ్‌ కార్డు వేసి ఓ సాధారణ మొబైల్‌ను ఇచ్చారు. ఆ తర్వాత మనోవేదన నుంచి కాస్త తేరుకున్న రాము.. మోసాన్ని గ్రహించి కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు క్రాంతి కుమార్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రూ.25లక్షల నగదు, 4.8గ్రాముల బంగారు ఉంగరం, 50తులాల వెండి, ఏటీఎం కార్డు, రెండు మొబైల్‌ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. క్రాంతి కుమార్‌ను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రత్న, పుట్టి సాయి కోసం గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 28 , 2026 | 06:32 AM