Share News

సుంకాలపై పునరాలోచన చేయాలి: రిపబ్లికన్లు

ABN , Publish Date - Nov 28 , 2026 | 08:57 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలకు కళ్లెం వేసేందుకు డెమొక్రాట్లు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. ఈ విషయంలో వారికి ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ల నుంచే మద్దతు లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

సుంకాలపై పునరాలోచన చేయాలి: రిపబ్లికన్లు

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలకు కళ్లెం వేసేందుకు డెమొక్రాట్లు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. ఈ విషయంలో వారికి ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ల నుంచే మద్దతు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్లు పరాజయాలను చవిచూసిన విషయం తెలిసిందే. దరిమిలా ట్రంప్ విధించిన కొన్ని సుంకాలపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని రిపబ్లికన్ నేతలు అభిప్రాయపడుతున్నారు.


చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్‌తో పాటు మరో తొమ్మిది దేశాలపై కొత్తగా సుంకాలు విధిస్తానని ట్రంప్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుంకాల విషయంలో రిపబ్లికన్లు ట్రంప్‌కు మద్దతు తెలుపుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల అనంతరం ఆరుగురికిపైగా రిపబ్లికన్ సభ్యులు పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ సుంకాలపై సమీక్షకు తాము సిద్ధమేనని వెల్లడించారు. అయితే ప్రతి సుంకాన్ని విడివిడిగా పరిశీలించాలని పేర్కొన్నారు. వాణిజ్య విధానాల్లో స్పష్టత, స్థిరత్వం ఉండాలని, సుంకాల విధింపుపై రాజ్యాంగపరమైన అధికారాలను కాంగ్రెస్ తిరిగి తన చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే అధ్యక్షుడి సుంకాల విధింపు అధికారాలను పూర్తిగా పరిమితం చేసే ప్రతిపాదనలకు మాత్రం వారు సుముఖత వ్యక్తం చేయలేదు. అంతేకాకుండా, సుంకాల రద్దుకు సంబంధించిన బిల్లులను ట్రంప్ వీటో చేసే అవకాశం ఉందని కూడా అంగీకరించారు.


ఈ అంశంపై రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇండియానా సెనేటర్ టాడ్ యంగ్ స్పందిస్తూ.. సుంకాల విధానంపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మిసిసిపీకి చెందిన రిపబ్లికన్ ప్రతినిధి మైకెల్ గెస్ట్ సైతం కొన్ని అంశాల్లో డెమొక్రాట్లతో ఏకీభవించే అవకాశం ఉందన్నారు. అధ్యక్షుడి సుంకాల విధింపు అధికారాలపై పూర్తిస్థాయి ఆంక్షలు విధించడాన్ని తాను వ్యతిరేకిస్తానని, అయితే డెమొక్రాట్లు ముందుకు తెచ్చే ప్రతిపాదనలను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నానని గెస్ట్ స్పష్టం చేశారు. కాగా.. ట్రంప్ సుంకాల విధానానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. తనను తాను 'మిస్టర్ టారిఫ్' గా అభివర్ణించుకుంటూ మిత్రదేశాలు, ప్రత్యర్థి దేశాలు అన్న తేడా లేకుండా భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి:

పూజ చేసి నీ కూతురి మనసు మార్చేస్తాం..!!

కాలేజీల సమీపంలోనే పరీక్షా కేంద్రాలు ఉండాలి

Updated Date - Nov 28 , 2026 | 08:57 AM