Share News

మిస్ యూనివర్స్ విజేతపై విమర్శలు.. అంతా ముందే ఫిక్స్ అంటూ నెటిజన్ల ఫైర్..

ABN , Publish Date - Nov 26 , 2026 | 06:42 PM

మిస్ యూనివర్స్-2026 పోటీల ఫలితాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో ఈ ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు. అయితే ఆమె విజయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మిస్ యూనివర్స్ విజేతపై విమర్శలు.. అంతా ముందే ఫిక్స్ అంటూ నెటిజన్ల ఫైర్..
Miss Universe 2026 Jennifer Barreto

ఇంటర్నెట్ డెస్క్: మిస్ యూనివర్స్-2026 పోటీల ఫలితాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో (Jennifer Barreto) ఈ ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు. అయితే ఆమె విజయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోటీల్లో న్యాయనిర్ణేతల నిర్ణయం సరిగ్గా లేదని, విజేతను ముందుగానే నిర్ణయించారేమోనని కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫిలిప్పీన్స్ తరఫున పాల్గొన్న బీ మిల్లన్-విండోర్స్కీ సమాధానాలు, ప్రదర్శన బాగున్నాయని, ఆమెకే కిరీటం దక్కాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు (Miss Universe Controversy).


మిస్ యూనివర్స్ 75వ పోటీలు నవంబర్ 24న ప్యూర్టోరికో రాజధాని శాన్ జువాన్‌లో జరిగాయి. వివిధ దేశాలకు చెందిన మొత్తం 116 మంది అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. చివరకు ఆతిథ్య దేశం ప్యూర్టోరికోకు చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచారు. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా న్యూనెజ్ మొదటి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగా రెండో రన్నరప్‌గా నిలిచారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన బీ మిల్లన్-విండోర్స్కీ మూడో రన్నరప్‌గా నిలిచారు. ఫలితాలు వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. పోటీలకు ఆతిథ్యమిచ్చిన ప్యూర్టోరికోకే కిరీటం దక్కడం వెనుక కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు (Miss Universe Rigged).


పోటీల ఫలితాలు ముందే నిర్ణయించారంటూ కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు (Puerto Rico Miss Universe Winner). చివరి ప్రశ్నోత్తరాల సమయంలో జెన్నిఫర్ ఇచ్చిన సమాధానం మిగతా పోటీదారులతో పోలిస్తే అంతగా ఆకట్టుకోలేదని పలువురు అభిప్రాయపడ్డారు. జెన్నిఫర్ విజయంపై అనుమానాలు వ్యక్తం కావడానికి మరో కారణం ఆమె తలపై ధరించిన అలంకరణ. చివరి ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర పోటీదారులు తమకు ప్రశ్నలు, ఇతరుల సమాధానాలు వినిపించకుండా శబ్ద నిరోధక హెడ్‌ఫోన్స్ ధరించారు. అయితే జెన్నిఫర్ మాత్రం తలపై ప్రత్యేకమైన అలంకరణ ధరించి, హెడ్‌ఫోన్స్ కూడా పెట్టుకున్నారు. దీంతో ఆమెకు ఇతరుల సమాధానాలు వినిపించే అవకాశం ఉందంటూ కొందరు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

అమెరికా వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..


అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..

Updated Date - Nov 26 , 2026 | 06:42 PM