అమెరికా వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:26 PM
ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారులకు షాకిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారులకు షాకిచ్చింది. తమ కన్సల్టింగ్ విభాగంలో పని చేస్తున్న చాలా మంది ఉద్యోగులకు అమెరికా వర్క్ వీసాలు, గ్రీన్ కార్డుల స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. విదేశాల్లోని ఐబీఎం కార్యాలయాలకు మారాలని లేదా ఉద్యోగాన్ని వదులుకోవాలని ఉద్యోగులకు తేల్చి చెప్పింది. డిసెంబర్ 31, 2026లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది (IBM H1B Visa).
ఐబీఎం యాజమాన్యం నిర్ణయంతో చాలా మంది భారతీయ ఐటీ నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. తమ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు ఉద్యోగులకు కేవలం మూడు వారాల సమయం మాత్రమే ఇచ్చింది. విదేశాల్లోని ఐబీఎం కార్యాలయాలకు బదిలీ కావడానికి అంగీకరిస్తే అక్కడ ఉద్యోగాన్ని కొనసాగించవచ్చు. లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. విదేశాలకు మారడానికి అంగీకరించని వారికి మూడు నెలల వేతనానికి సమానమైన పరిహారం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబర్ 31, 2026ను చివరి పని దినంగా నిర్ణయించినట్లు సమాచారం (IBM Visa Sponsorship).
ఈ నిర్ణయం ఐబీఎం కన్సల్టింగ్ విభాగానికి మాత్రమే వర్తిస్తుంది (H1B Visa News). ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో 1.50 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్నవారు, గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. వీసా స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేయడానికి మారుతున్న వ్యాపార అవసరాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల లభ్యత కారణమని ఐబీఎం తెలిపింది.
ఇవి కూడా చదవండి...
‘ఐటీ కంపెనీల పనివేళలు మార్చాలి’.. సైబరాబాద్ ట్రాఫిక్‌పై డీజీపీ సీవీ ఆనంద్
ప్రైవేట్ స్కూల్లో సిద్దిపేట జిల్లా సైన్స్ ఫేర్.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం