స్పెయిన్ కానరీ దీవుల సమీపంలో వలసదారుల పడవ మునక.. 8 మంది మృతి
ABN , Publish Date - Nov 28 , 2026 | 08:02 AM
స్పెయిన్ కానరీ దీవుల సమీపంలో వలసదారుల పడవ నీటమునిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి కాగా, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
మాడ్రిడ్, నవంబర్ 28: స్పెయిన్‌కు చెందిన కానరీ దీవుల సమీపాన అట్లాంటిక్ సముద్రంలో విషాదం చోటుచేసుకుంది. నిన్న పశ్చిమ ఆఫ్రికా నుంచి అక్రమంగా యూరప్‌కు బయలుదేరిన వలసదారుల పడవ ప్రమాదానికి గురైంది. వీరిని రక్షించే క్రమంలో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని స్పెయిన్ సముద్ర రక్షణ విభాగం వెల్లడించింది. సుమారు 100 మందితో ప్రయాణిస్తున్న ఈ పడవలో తీవ్ర అస్వస్థతకు గురైన మరో ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
ఎల్ హియెర్రో ద్వీపానికి దక్షిణంగా సుమారు 72 కిలోమీటర్ల దూరంలో ఈ పడవను గుర్తించిన రక్షణ సిబ్బంది, దానిని లా ఎస్తాకా ఓడరేవుకు లాక్కొచ్చారు.
మరో ఘటనలో, ఎల్ హియెర్రో ప్రధాన ఓడరేవైన లా రెస్టింగాకు 84 మంది వలసదారులతో కూడిన మరో పడవ సురక్షితంగా చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రిలో వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. (Canary Islands migrant boat)
పెరుగుతున్న వలసల తాకిడి, అత్యవసర పరిస్థితి
వాయువ్య ఆఫ్రికా తీరానికి సమీపంలో ఉన్న కానరీ దీవులు.. పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్, యూరోపియన్ యూనియన్ దేశాల్లోకి ప్రవేశించే వలసదారులకు ప్రధాన కేంద్రంగా మారాయి.
సెనెగల్, మౌరిటానియా, మొరాకో తీర ప్రాంతాల్లో నిఘా పెరగడంతో వలసదారులు మరింత దక్షిణాన ఉన్న గాంబియా, గినియా-బిస్సావు, గినియా దేశాల నుంచి సుదూర సముద్ర ప్రయాణాలు చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది.
అక్టోబర్ నుంచి వలసదారుల రాక భారీగా పెరిగింది. కేవలం 11,400 మంది జనాభా ఉన్న ఎల్ హియెర్రో ద్వీపానికి ఈ వారం ప్రారంభంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,100 మంది వలసదారులు చేరుకోవడంతో స్థానిక అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
స్పెయిన్ సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం
వలసదారుల మరణాలపై కానరీ దీవుల ప్రాంతీయ నేత ఫెర్నాండో క్లావిజో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 'ఈ మానవతా సంక్షోభం ఎల్ హియెర్రోలో మొదలవ్వలేదు, సెనెగల్, గాంబియా తీరాల్లో మొదలైంది. అక్కడే మనం చర్యలు తీసుకోవాలి' అని ఆయన 'ఎక్స్' (X) వేదికగా పేర్కొంటూ స్పెయిన్ ప్రభుత్వం, యూరోపియన్ కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు.
రేపు (ఆదివారం) స్పెయిన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ వలసల సమస్య ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మారింది. వలసల వల్ల ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ప్రధాని పెడ్రో శాంచెజ్ సమర్థిస్తుండగా, విపక్షాలు ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
పూజ చేసి నీ కూతురి మనసు మార్చేస్తాం..!!
కాలేజీల సమీపంలోనే పరీక్షా కేంద్రాలు ఉండాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News