Share News

వాషింగ్టన్ రీగన్ విమానాశ్రయంలో ఢీకొన్న రెండు విమానాల రెక్కలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 28 , 2026 | 10:44 AM

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న రొనాల్డ్ రీగన్ నేషనల్ విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతూ ట్యాక్సీయింగ్ చేస్తున్న రెండు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

వాషింగ్టన్ రీగన్ విమానాశ్రయంలో ఢీకొన్న రెండు విమానాల రెక్కలు.. వీడియో వైరల్
Reagan National Airport

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న రొనాల్డ్ రీగన్ నేషనల్ విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతూ ట్యాక్సీయింగ్ చేస్తున్న రెండు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. శుక్రవారం సాయంత్రం 5.10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డల్లాస్-ఫోర్ట్ వర్త్‌కు వెళ్లాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 638, చికాగోకు బయలుదేరాల్సిన ఫ్లైట్ 2152 విమానాలు కదులుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

రెండు బోయింగ్ 737-800 విమానాల రెక్కల చివరి భాగాలు పరస్పరం తగలడంతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర కుదుపునకు గురయ్యారు. విమానం బలంగా కంపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై కిటికీల నుంచి బయటకు చూశారు. విమానం రెక్కకు సంబంధించిన ఓ భాగం నేలపై పడినట్లు ప్రయాణికులు గుర్తించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వెల్లడించింది. అయితే ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రకటించింది.


తిరిగొచ్చిన విమానాలు.. FAA దర్యాప్తు..

విమానాల రెక్కలు ఢీకొన్న విషయాన్ని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు తెలియజేయడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు రెండు విమానాలను తిరిగి గేట్ల వద్దకు పంపించారు. ఈ ఘటనలో ఒక విమానం వింగ్‌లెట్ దెబ్బతిన్నట్లు పైలట్ నివేదించినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంభాషణల్లో వెల్లడైంది. విమానాశ్రయ సిబ్బంది ప్రమాద స్థలాన్ని పరిశీలించి.. విడిపోయిన శకలాలను స్వాధీనం చేసుకున్నారు. ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది కూడా విమానాలను తనిఖీ చేశారు. నిర్వహణ పరీక్షలు పూర్తయ్యే వరకు రెండు విమానాలను సేవల నుంచి తొలగించినట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ.. వారిని ప్రత్యామ్నాయ విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టింది. కాగా, 2025 జనవరిలో ఇదే రీగన్ నేషనల్ విమానాశ్రయం సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రాంతీయ విమానం, ఆర్మీ బ్లాక్‌హాక్ హెలికాప్టర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా రెండు విమానాల రెక్కలు ఢీకొన్న ఘటనతో మరోసారి ఈ విమానాశ్రయంలో విమానయాన భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్యాక్సీయింగ్ సమయంలో రెండు విమానాలు ఎలా ఢీకొన్నాయనే అంశంపై FAA దర్యాప్తు చేపట్టనుంది.


ఈ వార్తలనూ చదవండి:

భారతీయుడి ప్రపంచ రికార్డు.. 10 లక్షల మంది యూట్యూబ్ పెయిడ్ ఛానల్ మెంబర్స్..

ప్రశ్నలు మీవే.. సమాధానాలూ మీవే.. ఐఐటీలో ఇలాంటి పరీక్షలా?

Updated Date - Nov 28 , 2026 | 10:49 AM