Share News

ప్రశ్నలు మీవే.. సమాధానాలూ మీవే.. ఐఐటీలో ఇలాంటి పరీక్షలా?

ABN , Publish Date - Nov 27 , 2026 | 09:21 AM

ఐఐటీ గోవాలో నిర్వహించినట్టు చెబుతున్న ఓ వింత పరీక్ష ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ప్రశ్నలు మీవే.. సమాధానాలూ మీవే.. ఐఐటీలో ఇలాంటి పరీక్షలా?
Unique Examination Method in IIT Goa

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ రాకతో చదువుల తీరుతెన్నులు మారిపోతున్నాయి. సంప్రదాయ పరీక్షా విధానాలు, హోం వర్క్‌లకు కాలం చెల్లినట్టేనని ఇప్పటికే అనేక మంది విద్యావేత్తలు అభిప్రాయానికి వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఐఐటీ గోవాలో నిర్వహించినట్టు చెబుతున్న ఓ వింత పరీక్ష ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులే తమకు నచ్చిన ప్రశ్నలను రూపొందించుకుని, సమాధానాలు రాసుకునేలా ఈ పరీక్ష నిర్వహించినట్టు ఓ నెటిజన్ చెప్పుకొచ్చారు. ఆ పరీక్ష ప్రశ్న పత్రం ఫొటోను కూడా షేర్ చేశారు.


నెట్టింట వైరల్ అవుతున్న కథనం ప్రకారం, నవంబర్ 11న ఈ పరీక్ష నిర్వహించారు. అది ఈఈ 233 అనలాగ్ సర్క్యూట్స్‌కు సంబంధించిన పరీక్ష. మొత్తం 70 మార్కులకు పరీక్ష నిర్వహించారు. సాధారణ పరీక్షల సందర్భంగా ప్రశ్న పత్రాల్లోని ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు రాస్తుంటారు. కానీ ఈసారి పరీక్షలో మాత్రం విద్యార్థులు ఓ పాఠంలో తమకు అర్థమైన విషయాల ఆధారంగా ప్రశ్నలు రూపొందించుకోవాలి. ఇందుకోసం కొన్ని మార్కులు ఇస్తారు. ఆ తరువాత వాటికి సమాధానాలు రాయాలి. వీటికి మిగిలిన మార్కులను ఇస్తారు. ప్రశ్నల రూపకల్పనలో విద్యార్థులు ఒకరితో మరొకరు చర్చించకోకూడదు. అలా చేస్తే మార్కులు తగ్గిస్తామన్న హెచ్చరిక కూడా ఆ ప్రశ్నపత్రంలో ఉంది.


ఈ ప్రశ్న పత్రానికి సంబంధించిన ఫొటోను షేర్ చేసిన నెటిజన్ ఐఐటీ ప్రొఫెసర్లపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏఐ జమానాలో కాపీరాయుళ్లను పట్టుకునేందుకు ఓవైపు కాలేజీలు నానా యాతనా పడుతుంటే ఐఐటీ ప్రొఫెసర్లు మాత్రం రెండు అడుగులు ముందే ఉన్నారని కితాబునిచ్చారు. మరికొందరు మాత్రం ఈ ప్రశ్నపత్రంపై సందేహాలు వ్యక్తం చేశారు.అసలు ఇతంతా నిజమేనా అని ప్రశ్నించారు. కొందరు మాత్రం ప్రశంసలు కురిపించారు. ఓ విద్యార్థికి తను చదివిన పాఠాలు పూర్తిగా అర్థమయ్యాయో? లేదో? తెలుసుకునేందుకు ఇదే అత్యుత్తమ విధానమని కొందరు అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇన్‌స్టా పోస్ట్‌తో యువకుడి ప్రాణాలు కాపాడిన మెటా సంస్థ..

20 లీటర్ల పాలతో బాలీవుడ్ నటుడి స్నానం.. వింత రూమర్

Updated Date - Nov 27 , 2026 | 09:21 AM