Share News

ఇన్‌స్టా పోస్ట్‌తో యువకుడి ప్రాణాలు కాపాడిన మెటా సంస్థ..

ABN , Publish Date - Nov 26 , 2026 | 08:37 PM

సోషల్ మీడియా సంస్థ మెటా ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ఆధారంగా యువకుడి ప్రాణాలను కాపాడింది. ఇన్‌స్టాలో ఆత్మహత్యకు సంబంధించిన పోస్ట్‌ను గుర్తించిన ఆ సంస్థ వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసులకు అలర్ట్ పంపించింది.

ఇన్‌స్టా పోస్ట్‌తో యువకుడి ప్రాణాలు కాపాడిన మెటా సంస్థ..
Meta

గాజియాబాద్, నవంబర్ 26: సోషల్ మీడియా సంస్థ మెటా ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ఆధారంగా యువకుడి ప్రాణాలను కాపాడింది. ఇన్‌స్టాలో ఆత్మహత్యకు సంబంధించిన పోస్ట్‌ను గుర్తించిన ఆ సంస్థ వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసులకు అలర్ట్ పంపించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేవలం ఎనిమిది నిమిషాల్లోనే యువకుడి వద్దకు చేరుకుని అతడిని రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో నవంబర్ 24వ తేదీ రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.


పోలీసుల వివరాల ప్రకారం.. 19 ఏళ్ల యువకుడు ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే కొంతకాలంగా ఆమె దూరం పెట్టడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో నవంబర్ 24న రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. దాని కంటే ముందు ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనిని గుర్తించిన మెటా సంస్థ రాత్రి 8:12 గంటలకు ఉత్తరప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సోషల్ మీడియా సెంటర్‌కు సమాచారం అందించింది. దీంతో యువకుడి లొకేషన్‌ను గుర్తించి గాజియాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. వారు నంద్‌గ్రామ్ పోలీసులకు విషయం చెప్పడంతో ఎనిమిది నిమిషాల్లోనే యువకుడి నివాసానికి చేరుకున్నారు. అతడి గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉన్నాడు. చేతులకు గాయాలై రక్తస్రావం జరుగుతోంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో యువకుడి ప్రాణాలు నిలిచాయి.


ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఆత్మహత్యకు సంబంధించిన ప్రమాద సంకేతాలను గుర్తించి పోలీసులను అప్రమత్తం చేసేందుకు మెటా సంస్థ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రత్యేక వ్యవస్థను అమలు చేస్తున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికలపై ఇలాంటి పోస్టులు గుర్తించినప్పుడు పోలీసులకు మెటా సంస్థ సమాచారం అందిస్తుంది. సంబంధిత వ్యక్తి లొకేషన్‌ను గుర్తించి వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపడతారు. ఈ వ్యవస్థ ద్వారా 2023 జనవరి 1 నుంచి 2026 నవంబర్ 10 వరకు మొత్తం 4,237 మంది ప్రాణాలను కాపాడగలిగారు. దీంతో మెటా సంస్థపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

తాజ్‌మహల్ వద్ద షాకింగ్ సీన్.. కోతుల నిర్వాకం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

20 లీటర్ల పాలతో బాలీవుడ్ నటుడి స్నానం.. వింత రూమర్

Updated Date - Nov 26 , 2026 | 08:43 PM