Share News

తాజ్‌మహల్ వద్ద షాకింగ్ సీన్.. కోతుల నిర్వాకం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:43 PM

ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం తాజ్‌మహల్ వద్ద కోతుల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. కోతులు తాజ్‌మహల్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో గుమిగూడి పర్యాటకులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

తాజ్‌మహల్ వద్ద షాకింగ్ సీన్.. కోతుల నిర్వాకం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Taj Mahal

ఆగ్రా, నవంబర్ 26: ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం తాజ్‌మహల్ వద్ద కోతుల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజ్‌మహల్ పరిసరాల్లో వానరాలు పెద్ద సంఖ్యలో గుమిగూడి పర్యాటకులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు, పడమర ప్రవేశ ద్వారాలతో పాటు రాయల్ గేట్ పరిసరాల్లో వందల కొద్దీ సంచరిస్తుండటంతో సందర్శకుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఈ సమస్యకు అధికారులు ఎప్పుడు చెక్ పెడతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు దేశవిదేశాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం కోతుల గుంపులు ప్రధాన ద్వారాల వద్దే తిష్టవేసి, పర్యాటకులపై దాడులకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు భారతీయ, విదేశీ పర్యాటకులు కోతుల దాడులకు గురయ్యారు. గత సెప్టెంబర్‌లో తాజ్‌మహల్ సందర్శనకు వచ్చిన ఇద్దరు పర్యాటకులపై కోతులు దాడి చేశాయి. దీంతో వారిద్దరూ ఆస్పత్రి పాలయ్యారు. బాధితుల్లో ఒకరు బ్రెజిల్‌కు చెందిన 83 ఏళ్ల వృద్ధుడు కాగా, మరొకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన పర్యాటకుడు.


కొన్ని నెలల క్రితం తాజ్‌మహల్ ప్రాంగణంలోని నీటి ఫౌంటెన్‌లో కోతులు దూకుతూ, నీటిలో ఆడుకుంటున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా తాజ్‌మహల్ పరిసరాల్లో కోతులు స్వేచ్ఛగా సంచరిస్తున్న దృశ్యాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ప్రధాన ప్రవేశ ద్వారాల వద్దే అవి తిరుగుతుండటంతో, ఆ వీడియోలను చూసిన నెటిజన్లు పర్యాటకుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు, కోతుల సమస్యపై అధికారులు గతంలో పలుమార్లు చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. వాటిని పట్టుకోవడం, అక్కడి నుంచి తరలించడం వంటి ప్రయత్నాలు చేసినా సమస్య మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజ్‌మహల్ నిర్వహణకు బాధ్యత వహించే వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా సమస్య పరిష్కారానికి ఆటంకంగా మారుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా సమస్యను త్వరగా పరిష్కరించి, ఎలాంటి భయం లేకుండా తాజ్ మహల్ అందాలను పర్యాటకులు ఆశ్వాదించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పర్యాటక నగరం బ్యాంకాక్‌లో భారీ పేలుడు..

జాతీయ రహదారిపై విమానాల ల్యాండింగ్.. చరిత్ర సృష్టించిన భారత సైన్యం..

Updated Date - Nov 26 , 2026 | 06:12 PM