Share News

ఆదిలాబాద్‌లో దారుణం.. పెళ్లి పీటలెక్కాల్సిన యువతిని హత్య చేసిన తండ్రి

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:57 PM

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రిలో అడే కైలాస్, సుమిత్ర దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కల్యాణి అనే కుమార్తె ఉంది. నవంబర్ 25న ఆమె నిశ్చితార్థం జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందే విగతజీవిగా కనిపించింది.

ఆదిలాబాద్‌లో దారుణం.. పెళ్లి పీటలెక్కాల్సిన యువతిని హత్య చేసిన తండ్రి
Adilabad Honour Killing

ఆదిలాబాద్, నవంబర్ 26: ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. మరికొన్ని రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే ఆ ఇంట్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువతి ప్రేమ వ్యవహారంతో శవమై కనిపించింది. పరువు పోతుందనే కారణంతో ఆమెను కన్న తండ్రే కడతేర్చాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.


ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రిలో అడే కైలాస్, సుమిత్ర దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కల్యాణి (18) అనే కుమార్తె ఉంది. ఇటీవల ఆమెకు ఓ పెళ్లి సంబంధం కుదరగా.. నవంబర్ 25న నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఇందుకోసం కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, నవంబర్ 23న కల్యాణి ప్రవర్తనలో మార్పును గమనించిన తండ్రి ఆమెను గట్టిగా నిలదీశాడు. ఈ క్రమంలో మేనత్త కుమారుడిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. దీంతో కైలాస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.


నవంబర్ 24 తెల్లవారుజామున ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రిస్తుండగా కుమార్తె వద్దకు వెళ్లాడు. ఆమె గొంతు నులిమి హత్య చేశాడు కైలాస్. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో అంగీకరించాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. యువతి చున్నీతోనే ఫ్యాన్‌కు ఉరితీశాడు. ఉదయం నిద్రలేచిన తల్లి.. కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. తొలుత కల్యాణి ఆత్మహత్య చేసుకుందని స్థానికులు, కుటుంబ సభ్యులు భావించారు. అయితే, హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడంపై అనుమానాలు తలెత్తాయి.


ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. గ్రామానికి చేరుకున్న పోలీసులు.. కైలాస్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది. కుటుంబం పరువు పోతుందనే కారణంతో హత్య చేసినట్లు కైలాస్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆమె కోరిక చివరికి ప్రాణాలనే తీసేసిందని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, యువతి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

జాతీయ రహదారిపై విమానాల ల్యాండింగ్.. చరిత్ర సృష్టించిన భారత సైన్యం..

రాజ్యాంగంపై కేంద్రం కుట్రలను తిప్పికొడతాం: సీఎం రేవంత్ రెడ్డి

Updated Date - Nov 26 , 2026 | 05:08 PM