జాతీయ రహదారిపై విమానాల ల్యాండింగ్.. చరిత్ర సృష్టించిన భారత సైన్యం..
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:01 PM
భారత సైన్యం మరో అరుదైన ఘనత సాధించింది. సాధారణంగా వాహనాల రాకపోకలకు మాత్రమే ఉపయోగించే జాతీయ రహదారిపై నాలుగు సైనిక విమానాలను విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
గాంధీనగర్, నవంబర్ 26: భారత సైన్యం మరో అరుదైన ఘనత సాధించింది. సాధారణంగా వాహనాల రాకపోకలకు మాత్రమే ఉపయోగించే జాతీయ రహదారిపై నాలుగు సైనిక విమానాలను విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. గుజరాత్‌లోని అమృత్సర్-జామ్‌నగర్ ఎకనామిక్ కారిడార్‌పై ఈ వినూత్న ప్రయోగం జరిగింది. భారత సైన్యానికి చెందిన ‘టీమ్ మౌంటైన్ ఈగిల్స్’ బృందం ఈ సాహసోపేత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
భారత సైన్యం చేపట్టిన ‘వింగ్స్ ఆఫ్ వాలర్ అండ్ యూనిటీ ఎక్స్‌పెడిషన్-2026’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రెండు ఫిక్స్డ్ వింగ్ మైక్రోలైట్ విమానాలు, రెండు పవర్డ్ హ్యాంగ్ గ్లైడర్లు పాల్గొన్నాయి. గుజరాత్‌లోని పాటన్ జిల్లాలో అమృత్సర్-జామ్‌నగర్ ఎకనామిక్ కారిడార్‌లో 946 నుంచి 949 కిలోమీటర్ల మధ్య ఈ విమానాలు విజయవంతంగా దిగాయి. అనంతరం తిరిగి గాల్లోకి ఎగిరాయి. విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు రహదారి ఉపరితలం, భౌగోళిక పరిస్థితులు, భద్రతా ప్రమాణాలను అధికారులు ముందుగానే పరిశీలించారు. అలాగే, స్థానిక పోలీసు యంత్రాంగం, జిల్లా అధికారులు, ఎన్హెచ్ఏఐ సిబ్బంది సమన్వయంతో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా మళ్లించారు.
ఈ అరుదైన ఘనతపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హర్షం వ్యక్తం చేశారు. భారత సైన్యం, ఎన్హెచ్ఏఐ అధికారుల సమన్వయాన్ని ప్రశంసించారు. దేశంలో నిర్మిస్తున్న ఆధునిక జాతీయ రహదారులు కేవలం ప్రయాణ సౌకర్యాలకే పరిమితం కాదని, సైనిక అవసరాలు, అత్యవసర పరిస్థితుల్లో కీలకంగా ఉపయోగపడగలవని పేర్కొన్నారు. కాగా, నవంబర్ 14న ప్రారంభమైన ‘వింగ్స్ ఆఫ్ వాలర్ అండ్ యూనిటీ ఎక్స్‌పెడిషన్’ మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా సాగుతోంది. నవంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని మౌలో ఈ యాత్ర ముగియనుంది. ఈ కార్యక్రమం భారత సైన్యం సాహసం, సాంకేతిక సామర్థ్యం, దేశ మౌలిక సదుపాయాల బలాన్ని చాటిచెబుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
జ్యుడీషియల్ మెంబర్ తప్పనిసరి.. ఈడీ ఆస్తుల జప్తుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
పర్యాటక నగరం బ్యాంకాక్‌లో భారీ పేలుడు..