పర్యాటక నగరం బ్యాంకాక్‌లో భారీ పేలుడు..
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:14 PM
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ప్రముఖ బాంగ్‌చాక్ చమురు శుద్ధి, నిల్వ కేంద్రంలో పేలుడు జరగడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
బ్యాంకాక్, నవంబర్ 26: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఇవాళ (గురువారం) భారీ పేలుడు సంభవించింది. ప్రముఖ బాంగ్‌చాక్ చమురు శుద్ధి, నిల్వ కేంద్రంలో పేలుడు జరగడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడటంతో పాటు దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా కమ్మేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సమీప ప్రాంతాల ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు.
భారీ పేలుడుతో ఎగసిపడిన మంటలు, దట్టమైన నల్లటి పొగ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు కనిపించింది. దీంతో బ్యాంకాక్ వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన బాంగ్ నా జిల్లా అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. చమురు కేంద్రానికి సమీప ప్రాంతాల ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అలాగే, ప్రమాద తీవ్రత దృష్ట్యా ఆయా ప్రాంతాలకు చేరుకుని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులనూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈ సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు పాల్గొన్నాయి. ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, తూర్పు బ్యాంకాక్‌లో ఉన్న ఈ కేంద్రాన్ని థాయ్ ఇంధన సంస్థ బాంగ్‌చాక్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. రోజుకు 1.20 లక్షల బ్యారెళ్ల శుద్ధి సామర్థ్యంతో ఇది థాయ్‌లాండ్‌లోని ఐదో అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంగా ఉంది. ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఎన్విడియా సీఈఓ ఎఫైర్ వెనుక చైనా కుట్ర లేదు.. యూఎస్ నిఘా అధికారులు
కైరోలో ఫ్యూయల్ ట్యాంకర్ బోల్తా.. భారీ అగ్నిప్రమాదంలో 31 మంది సజీవ దహనం