Share News

స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:06 PM

డీలిమిటేషన్ బిల్లుపై బడా నేతల మధ్య సోషల్ మీడియా వార్ షురూ అయింది. స్టాలిన్‌ను కలిసి బిల్లును వ్యతిరేకించాలని కోరతామని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేయగా, చరిత్ర మమ్మల్ని కట్టబొమ్మన్లుగా చూస్తుందంటూ స్టాలిన్ బదులిచ్చారు.

స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్
Rahul Gandhi Stalin tweet

ఢిల్లీ, చెన్నై, నవంబర్ 29: రేపటి నుంచి జరుగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో ఇండియా కూటమిలోని కీలక పక్షాలైన కాంగ్రెస్, డీఎంకే అగ్రనేతల మధ్య ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ X (ట్విట్టర్) వేదికగా బహిరంగ విజ్ఞప్తి చేయగా, దానికి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ అంతే వేగంగా స్పందించారు.

రాహుల్ గాంధీ బహిరంగ విజ్ఞప్తి

తాను, ఇండియా కూటమి సీనియర్ నేతలు కలిసి చెన్నై వెళ్తున్నామని, డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లులను వ్యతిరేకించాలని ఎం.కె. స్టాలిన్‌తో పాటు డీఎంకే పార్టీని స్వయంగా కలిసి కోరనున్నామని రాహుల్ గాంధీ X వేదికగా వెల్లడించారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచితే దేశంలో ప్రజాస్వామ్యం అంతమవుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సీట్ల పెంపుతో దేశ ఎన్నికల మ్యాప్‌ను బీజేపీ-ఆర్ఎస్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అపరిమితమైన అవకాశం దక్కుతుందని విమర్శించారు. తమిళ వ్యతిరేక శక్తులపై 'బ్రదర్ స్టాలిన్' ఎప్పుడూ ఒక పర్వతంలా దృఢంగా నిలబడ్డారని ప్రశంసిస్తూ దేశం, తమిళనాడు ప్రయోజనాలు, రాజ్యాంగ రక్షణ కోసం కలిసికట్టుగా ఈ బిల్లును ఓడించాలని రాహుల్ పిలుపునిచ్చారు. (Rahul Gandhi Stalin tweet)


స్టాలిన్ ఘాటు స్పందన!

రాహుల్ గాంధీ పోస్ట్‌కు బదులిచ్చిన ఎం.కె. స్టాలిన్, రాజ్యాంగం, రాష్ట్రాల హక్కుల రక్షణలో డీఎంకే పోషించిన చారిత్రక పాత్రను గుర్తించిన 'సోదరుడు రాహుల్ గాంధీ'కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అయితే, తాము ఎల్లప్పుడూ తమిళనాడు, తమిళ ప్రజల ప్రయోజనాలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎప్పటికీ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చివరగా, చరిత్ర తమను 'ఎట్టప్పన్'లుగా (ద్రోహులుగా) కాకుండా, వీరపాండ్య 'కట్టబొమ్మన్'లుగానే గుర్తుంచుకుంటుందని తనకు పూర్తి నమ్మకం ఉందని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

కాగా, కట్టబొమ్మన్ బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఎట్టప్పన్ బ్రిటిష్‌వారితో చేతులు కలిపిన వ్యక్తిగా చెబుతుంటారు. దీంతో స్టాలిన్ తన పార్టీని స్వాతంత్ర్య పోరాట యోధులతో పోల్చుకున్నట్లైంది.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 29 , 2026 | 01:08 PM