Share News

CP Sajjanar: లక్కీ డ్రాల పేరుతో సోషల్ మీడియాలో మోసాలు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Jan 17 , 2026 | 01:55 PM

సోషల్ మీడియాలో లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పాపులారిటీ ఉన్న ఇన్‌ఫ్లూయెన్సర్లు అయినాసరే చట్టానికి అతీతులు కాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

CP Sajjanar: లక్కీ డ్రాల పేరుతో సోషల్ మీడియాలో మోసాలు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
CP Sajjanar

హైదరాబాద్, జనవరి17: సోషల్ మీడియాలో లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ సీపీ సజ్జనార్(CP Sajjanar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు ఇస్తామంటూ ఆకర్షణీయ ప్రకటనలతో అమాయకులను మోసం చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు సీపీ సజ్జనార్.


ఫేక్ లక్కీ డ్రాలు..

ఇటీవల సోషల్ మీడియా వేదికగా లక్కీ డ్రాల పేరుతో భారీగా మోసాలు జరుగుతున్నాయని గుర్తించామని అన్నారు. ‘కేవలం రూ.99తో కారు గెలుచుకోండి. లక్కీ డ్రాలో బైక్, ప్లాట్, ఖరీదైన బహుమతులు’ అంటూ ప్రచారం చేస్తూ ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఈ స్కామ్‌లలో ముఖ్యంగా యువత, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారని సజ్జనార్ పేర్కొన్నారు.


కొత్త మోసాలు..

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో కొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్లు కొత్త వేషాల్లో లక్కీ డ్రా స్కామ్‌లకు తెరలేపారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌ల మాదిరిగానే వీటి ద్వారా కూడా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి, చివరికి ఎలాంటి బహుమతులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఈ విషయంలో సీపీ సజ్జనార్ కఠినంగా స్పందించారు. సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్లయినా సరే ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.


చట్టపరమైన చర్యలు తప్పవు..

లక్కీ డ్రాల పేరుతో మోసాలకు పాల్పడే వారిపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యూలేషన్ స్కీమ్స్(బ్యానింగ్) యాక్ట్ – 1978 కింద కేసులు నమోదు చేస్తామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. అవసరమైతే ఐటీ యాక్ట్, చీటింగ్ కేసులు, క్రిమినల్ చట్టం కింద సెక్షన్లు విధించే అవకాశం ఉందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.


ప్రజలకు సూచనలు..

ప్రజలు లక్కీ డ్రాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయ ప్రకటనలను నమ్మకండని.. ముందుగా డబ్బులు అడిగే లక్కీ డ్రాలు మోసమేనని, కార్లు, బైకులు, ప్లాట్లు ఇస్తామంటూ చేసే ఆఫర్లను నిర్ధారించుకోకుండా నమ్మొద్దని సూచించారు. అనుమానాస్పద ఖాతాలు, పోస్టులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. లక్కీ డ్రా స్కామ్‌లకు గురైన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో, సైబర్ క్రైమ్ విభాగంలో అధికారిక హెల్ప్‌లైన్స్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.


ఇవి కూడా చదవండి...

ఆ నలుగురు సీఎంలపై మంత్రి తుమ్మల ఇంట్రస్టింగ్ కామెంట్స్..

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు బ్రేక్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 17 , 2026 | 03:28 PM