Share News

ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి ఘటన.. బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు

ABN , Publish Date - Sep 09 , 2026 | 09:06 PM

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సంబంధించిన ఎర్రవల్లి ఫాంహౌస్‌కి దళితులు వెళ్లడంతో పసుపు నీటితో బీఆర్ఎస్ నేత సంధ్యారాణి శుద్ధి చేశారని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ధ్వజమెత్తారు.

 ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి ఘటన.. బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు
Medipally Satyam

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సంబంధించిన ఎర్రవల్లి ఫాంహౌస్‌కి దళితులు వెళ్లడంతో పసుపు నీటితో బీఆర్ఎస్ నేత సంధ్యారాణి శుద్ధి చేశారని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ధ్వజమెత్తారు. ఈ క్రమంలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు ఎమ్మెల్యే సత్యం వెళ్లి సంధ్యారాణిపై ఫిర్యాదు చేశారు. దళితులను అవమానించారని ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే సత్యం మాట్లాడారు.


దళిత సమాజం ఏకతాటిపైకి వచ్చింది..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే సత్యం తెలిపారు. బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై దళిత సమాజం ఏకతాటిపైకి వచ్చిందని అన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర నిన్న(మంగళవారం) డప్పులతో దళితులు నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. దళితులు రావడంతో ఆ ప్రాంతంలో పసుపు నీళ్లతో శుద్ధి చేశారని ఆగ్రహించారు. ఈ ఘటనతో బీఆర్ఎస్ నేతలు అహంకారాన్ని చాటుకున్నారని మండిపడ్డారు.


ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదు..

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని ఎమ్మెల్యే సత్యం తెలిపారు. బీఆర్ఎస్ నరనరాల్లో దళిత వ్యతిరేకత ఉందని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారందరిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. లక్షలాది మంది దళితుల మనోభావాలను గులాబీ పార్టీ దెబ్బతీసిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం.. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు: కేటీఆర్

శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ సస్పెన్షన్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ఆలోచన మాకు లేదు: స్పీకర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 09:34 PM