ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ.. కేంద్రమంత్రులు గడ్కరీ, రామ్మోహన్‌తో కీలక భేటీలు
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:14 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై చర్చించారు.
ఢిల్లీ, జులై 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్, ఎంపీ రఘువీర్ రెడ్డి, రాష్ట్ర అధికారులు సమావేశమై రీజినల్ రింగ్ రోడ్డు (RRR)తో పాటు తెలంగాణలోని పలు జాతీయ రహదారుల నిర్మాణాల గురించి మాట్లాడారు.
రీజినల్ రింగ్ రోడ్డుపై చర్చ..
ఈ సమావేశంలో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి 95 శాతం భూసేకరణ పూర్తయిందని సీఎం వివరించారు. ఉత్తర భాగం పనులు ప్రారంభించేందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని నితిన్ గడ్కరీని కోరారు. అలాగే రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన కేంద్ర అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హైదరాబాద్ – అమరావతి మధ్య 12వ వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టాలని కూడా సీఎం రేవంత్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా, పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.
కేంద్రమంత్రి రామ్మోహన్‌తో సీఎం రేవంత్ సమావేశం..
మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కూడా సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న విమానాశ్రయాల అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. ప్రత్యేకంగా అదిలాబాద్ విమానాశ్రయం, వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన డిజైన్, మౌలిక వసతుల కల్పన, నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. ఈ ప్రాజెక్టులను వేగవంతం చేసి తెలంగాణలో ప్రాంతీయ విమాన సేవలను విస్తరించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో రహదారులు, విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్ర సహకారం అందించే అంశంపై ఈ భేటీలు కీలకంగా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
విమాన ఛార్జీల దోపిడీపై సుప్రీంకోర్టు సీరియస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News