అధికారం పోయినా అహంకారం వీడలేదు: బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ ఫైర్
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:06 AM
శాసన సభ సజావుగా జరగకుండా బీఆర్ఎస్ ఫాంహౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన కుట్ర చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులను దూషించడం ద్వారా మూడు రోజులు సభను సజావుగా జరగకుండా చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11: శాసన సభ సజావుగా జరగకుండా బీఆర్ఎస్ ఫాంహౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన కుట్ర చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులను దూషించడం ద్వారా మూడు రోజులు సభను సజావుగా జరగకుండా చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.
శుక్రవారం హైదరాబాద్‌లో శాసనసభ పక్ష (సీఎల్పీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారులపై అనుచితంగా వ్యవహరించడంతోపాటు మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి ఇబ్బంది కలిగించడం వంటి పనులు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారని గుర్తు చేశారు.
నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పి కొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు తెలియజేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాంటూ పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ ప్రశంసల జల్లు కురిపించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నాటి నుంచి జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టామని చెప్పారు.
ఎమ్మెల్యేలకు కీలక సూచనలు..
ప్రజలు ఇచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్‌లో రాజకీయంగా రాణించలేరని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తప్పనిసరిగా సభలో జరిగే చర్చల్లో పాల్గొనాలని వారికి సూచించారు. అలాగే సభలో హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలని ఎమ్మెల్యేలను కోరారు. సభలో నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించాలని వారికి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని ఈ సభను నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ వివరించారు. అందరికీ వెసులుబాటుగా ఉండాలని అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి నిర్వహిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో సెంట్రల్ హాల్‌ను ప్రారంభించుకుని మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టుకున్నామని చెప్పారు.
ఆ ఇద్దరిపై మండిపాటు..
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగి.. ఆ పార్టీకే నష్టం చేకూర్చాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకుంటే.. వీరిద్దరు రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా? అని ఆయన ప్రశ్నించారు. పోలీస్ సిబ్బందిలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కనిపించినట్టున్నారని వ్యంగ్యంగా అన్నారు.
అంత ఆక్రోశంతో అధికారులపై దాడులు చేశారని పేర్కొన్నారు. దేశానికి మనం చేసిన జనగణన రోల్ మోడల్‌గా నిలిచిందని గుర్తు చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత అని తెలిపారు. తెలంగాణ నమూనాను జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ నేతలకు సీఎం సూచించారు.
ప్రమాదం పొంచి ఉంది..
SIR పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. SIR అంశాన్ని సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును కాపాడే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నిర్దేశించారు. మీ ప్రతీ ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుందన్నారు. మీ వ్యక్తిగత పనితీరు మీ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందని చెప్పారు. దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా తేల్చారు, కానీ ఓటర్ల జాబితాలో మాత్రం 88 కోట్లుగా చూపుతున్నారని వివరించారు.
దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 1000 రోజుల పాలనకు సహకరించినందుకు ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీ సహకారంతో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు తీసుకువచ్చామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్ ‘మాకొద్దు బాబోయ్’
మెట్రో టేకోవర్ కోసం రుణాల వేట
Read Latest AP News And Telangana News And International News And Telugu News