చూస్తే నోరూరు.. తింటే బేజారు!
ABN , Publish Date - May 07 , 2026 | 10:52 AM
మామిడి పండ్లు అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టంగా తినే పండు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పండుతున్నప్పటికీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ పండుకు ఎంతో పేరు ఉంది.
మామిడి కాయను రసాయనాలతో మగ్గబెట్టి పండుగా మారుస్తున్న వ్యాపారులు
కాల్షియం కార్బైడ్ ఆరోగ్యానికి చేటని నిషేధించినా సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్
హైదరాబాద్: మామిడి పండ్లు అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టంగా తినే పండు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పండుతున్నప్పటికీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ పండుకు ఎంతో పేరు ఉంది. మామిడి సీజన్ వచ్చిందంటే కాల్షియం కార్బైడ్ అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. చెట్ల మీద కాయలను ముందుగానే మార్కెట్‌లోకి తీసుకువచ్చి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించి త్వరగా పండే విధంగా వ్యాపారులు మార్కెట్‌లోకి చేరుస్తున్నారు. ఇది విడుదల చేసే రసాయనవాయువు త్వరగా పచ్చికాయను పండుగా మారుస్తుంది.
దీంతో అలా పండిన మామిడి రుచిగా ఉండదు. అదే సమయంలో ఆరోగ్యానికి కూడా ఎంతో హాని చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు కాల్షియం కార్బైడ్‌ను నిషేధించింది. మామిడి దిగుబడులు ప్రారంభమైన నేపథ్యంలో ఆహార భద్రత, కల్తీ నియంత్రణ శాఖ అధికారులు ఈ విషయంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మగ్గిపెట్టిన మామిడి పండ్లను సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, లాల్‌బజార్, కార్ఖానా తదితర ప్రాంతాలలో విచ్చల విడిగా విక్రయిస్తున్నారు.
పలు దేశాల్లో నిషేధం
కాల్షియం కార్బైడ్ పారిశ్రామికంగా సున్నం కోడ్ మిశ్రమాన్ని ఎలక్ట్రిక్ ఫర్నీస్‌లో సుమారు రెండు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో తయారు చేస్తారు. అధిక ఉష్ణోగ్రతతో నత్రజనితో కలిసినప్పుడు కాల్షియం ఏర్పడుతుంది. దీన్ని రసాయనిక ఎరువుగా వినియోగిస్తారు. ఉక్కు పరిశ్రమలో దీన్ని ఎక్కువగా వాడతారు. కాల్షియం కార్బైడ్ తేమతో కలిసినప్పుడు ఎసిథిలిన్ వాయువు మొదలవుతుంది. ఈ వాయువు కాయలను మగ్గించే ప్రక్రియకు దోహదపడుతుంది. మామిడి, బత్తాయి, బొప్పాయి, పైనాపిల్, నిమ్మ లాంటి వాటిని మగ్గించేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఈ వినియోగాన్ని అనేక దేశాలు నిషేధించాయి. మనదేశంలో కూడా సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది. ఆహార కల్తీ నిరోధక చట్టం ప్రకారం కార్బైడ్‌తో కాయల పక్వానికి తేవడం, అమ్మకం చేయడం నేరంగా ప్రకటించింది.
తనిఖీలు చేపట్టాలి
ఆహార భద్రత అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కాయలు మగ్గించే వారిపై నిరంతరం నిఘా ఉంచాలి. మార్కెటింగ్ శాఖ వారు మార్కెట్ యార్డులో కాల్షియం కార్బైడ్ విక్రయాలు జరుగకుండా చూడాలి. వీటిని వినియోగించి అమ్మే వ్యాపారుల లైసెన్స్‌లను రద్దు చేయాలి. ఉద్యానవన శాఖ సమన్వయంతో కార్బెట్ వినియోగంతో కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించాలి. వ్యవసాయ శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాలి. వినియోగదారులు పండ్లను కొనే సమయంలో నాణ్యతను పరిశీలించుకోవాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా అధికారులకు ఫిర్యాదు చేయాలి.
ఆరోగ్యానికి హాని
కాయలను మగ్గబెట్టేందుకు వాడే కాల్షియం కార్బైడ్‌లో 30శాతం మలినాలు ఉంటాయి. కొద్దిగా ఆర్సెనిక్, పాస్పరస్, కాంపౌండ్‌లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానిచేస్తాయి. కార్బైడ్ క్యాన్సర్‌ను కలుగజేసి ఎసిటాల్డి హైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది. కార్బైడ్ తేమతో కలిసినప్పుడు విడుదలయ్యే ఎసిటిలిన్ వాయువు మెదడుకు ప్రాణవాయువును సరఫరా చేసే నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
సహజంగా పండిన పండ్లనే తినాలి
కాల్షియం కార్బైడ్‌తో మగ్గబెట్టిన పండును తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. సహజ సిద్ధంగా పండిన పండ్లనే కొనుగోలు చేయాలి. కాల్షియం కార్బైడ్‌తో పండిన పండ్లతో కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పండ్ల నాణ్యతను చూసి మాత్రమే కొనుగోలు చేయాలి.
డా.శ్రీకాంత్, అల్వాల్ పీహెచ్‌సీ
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
తెలంగాణలో బీజేపీకి సానుకూల పవనాలు
Read Latest Telangana News and National News