పండ్ల వ్యాపారి గొప్ప మనసు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..
ABN , Publish Date - May 07 , 2026 | 09:46 AM
ఫుట్‌పాత్‌పై అరటి పండ్లు కొన్న ఓ యువకుడు రూ. 15 రూపాయలకు బదులుగా పొరపాటున 1515 రూపాయలు పేమెంట్ చేశాడు. యువకుడి పొరపాటును గుర్తించిన షాపు యజమాని హుందాగా వ్యవహరించాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఫుట్‌పాత్‌పై అరటి పండ్లు కొన్న ఓ యువకుడు రూ. 15 రూపాయలకు బదులుగా పొరపాటున 1515 రూపాయలు పేమెంట్ చేశాడు. యువకుడి పొరపాటును గుర్తించిన షాపు యజమాని హుందాగా వ్యవహరించాడు. అక్కడినుంచి వెళ్లిపోతున్న యువకుడి వెంట పరిగెత్తి మరీ 1500 రూపాయలు తిరిగిచ్చాడు. పుణెకు చెందిన రుషి అనే యువకుడు తన ఎక్స్ ఖాతాలో బుధవారం ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో.. ‘నిన్న సాయంత్రం పండ్ల షాపులో 15 రూపాయలకు బదులు పొరపాటున 1515 రూపాయలు పేమెంట్ చేశాను. ఆ సమయంలో నేను నా స్నేహితులతో మాట్లాడుతున్నాను’..
‘మాటల్లో పడి స్క్రీన్ మీద అమౌంట్ చూడకుండానే పేమెంట్ చేశాను. పండ్లు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాను. షాపు యజమాని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ట్రాఫిక్ సౌండ్ కారణంగా అతడి అరుపులు నాకు వినిపించలేదు. అతడు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. 15 రూపాయలకు బదులు 1515 రూపాయలు పేమెంట్ చేశానని చెప్పాడు. వెంటనే 1500 రూపాయలు నాకు పంపేశాడు. నేను అతడికి ధన్యవాదాలు చెప్పగా.. చాలా సంతోషించాడు. అమౌంట్ ఎంతో చెక్ చేసుకోకుండా ఇకపై పేమెంట్ చేయవద్దని అన్నాడు. కొంత మంది వ్యాపారులకు మంచి మనసు ఉంటుంది. ప్రపంచానికి ఇలాంటి వారు చాలా మంది కావాలి’ అని రాసుకొచ్చాడు.
ఆ యువకుడు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘అతడు చెప్పింది నిజమే ఇలాంటి మంచి వ్యాపారులు మన దేశానికి చాలా మంది కావాలి’..‘ఆ వ్యాపారి మంచితనానికి మారు పేరులా ఉన్నాడు. కచ్చితంగా అతడిని సన్మానించాల్సిందే’..‘మోసం చేసే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఈ సమాజంలో ఇలాంటి వాళ్లు చాలా తక్కువ’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
చంద్రనాథ్ రథ్ హత్యను ఖండించిన సువేందు అధికారి..
ధాన్యం రవాణాపై రవాణా శాఖ కీలక ఆదేశాలు