Share News

చంద్రనాథ్ రథ్ హత్యను ఖండించిన సువేందు అధికారి..

ABN , Publish Date - May 07 , 2026 | 09:00 AM

పశ్చిమ బెంగాల్ బీజేపీ అగ్రనేత సువేందు అధికారి తన వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్యకు గురికావడంపై స్పందించారు. తన పీఏ చంద్రనాథ్ రథ్ హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రనాథ్ రథ్ హత్యను ఖండించిన సువేందు అధికారి..
BJP Leader Suvendu Adhikari

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ అగ్రనేత సువేందు అధికారి తన వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్యకు గురికావడంపై స్పందించారు. తన పీఏ చంద్రనాథ్ రథ్ హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన హత్య అని సువేందు ఆరోపించారు. ఈ ఘటనతో బీజేపీ శ్రేణులతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారని చెప్పారు. బీజేపీ ఢిల్లీ అధిష్ఠానం హత్య ఘటన గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందని సువేందు వెల్లడించారు.


ఈ హత్యకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో తాను మాట్లాడినట్లు సువేందు తెలిపారు. మరోవైపు చంద్రనాథ్ రథ్ కుటుంబంతో కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మాట్లాడి ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. దాడికి పాల్పడిన వారి గురించి కొన్ని కీలక ఆధారాలు లభించాయని సువేందు తెలిపారు. ఇది టీఎంసీ 15 ఏళ్ల పాలనలోని మహా జంగిల్ రాజ్ ఫలితమని.. ఇక్కడి గూండాలను ఏరి వేసే పనిని బీజేపీ ప్రారంభిస్తుందని తేల్చి చెప్పారు. పార్టీ కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఈ సందర్భంగా సువేందు విజ్ఞప్తి చేశారు.


బీజేపీ శ్రేణులు ఫైర్..

ఈ హత్య ఘటనపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీనే చంద్రనాథ్ రథ్‌ను హత్య చేయించిందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. అధికారం కోల్పోయినా తమను తక్కువ అంచనా వేయెుద్దని తెలియజేసేందుకే మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈ హత్యను చేయించారని బీజేపీ నేత అర్జున్ సింగ్ ఆరోపించారు. ఈ దాడితో టీఎంసీకి సంబంధం ఉందని బీజేపీ నాయకురాలు అగ్నిమిత్ర అన్నారు. భవానిపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి ఫలితమే ఈ హత్యకు కారణమని ఆమె ఆరోపించారు. ఈ హత్యను కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ తీవ్రంగా ఖండించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇలాంటి ఘటనలు అన్నింటినీ అరికడతామని అన్నారు.


ఖండించిన టీఎంసీ..

మరోవైపు తమపై వస్తున్న ఆరోపణలను టీఎంసీ ఖండించింది. చంద్రనాథ్ రథ్ హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యంలో హింస, రాజకీయ హత్యలకు చోటు లేదంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి

భారత్ దేనినీ క్షమించదు.. ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీడియో..

పంజాబ్‌లో జంట పేలుళ్లు బీజేపీ పనే కావొచ్చు: సీఎం మాన్‌

Updated Date - May 07 , 2026 | 09:03 AM