Share News

Job Fraud Scam: గ్రూప్-1 ఉద్యోగం ఇప్పిస్తానని భారీ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 10:54 AM

ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన జాబ్ ఫ్రాడ్ ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ‘అబ్దుల్ కలామ్ ఓఎస్డీ’ అని తనను తాను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, గ్రూప్ వన్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Job Fraud Scam: గ్రూప్-1 ఉద్యోగం ఇప్పిస్తానని భారీ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు
Job Fraud Scam

హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన జాబ్ ఫ్రాడ్ ఘటన (Hyderabad Job Fraud Case) హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ‘అబ్దుల్ కలామ్ ఓఎస్డీ’ ( Abdul Kalam OSD) అని తనను తాను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, గ్రూప్ వన్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో (Banjara Hills Police Station) ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గ్రూప్–1 వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షలకు (Group-1 Exam) సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది.


ఫిర్యాదు వివరాలిలా..

బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ గ్రూప్–1 అభ్యర్థిని సయ్యద్ హైదర్ హుస్సేన్ అనే వ్యక్తి సంప్రదించాడు. తనకు ఢిల్లీలో ఉన్నత స్థాయిలోని నేతలతో పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. ప్రభుత్వ పెద్దలతో కలిసి దిగిన ఫొటోలు చూపిస్తూ తనకు నమ్మకం కలిగించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను అబ్దుల్ కలామ్ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేశానని చెప్పాడని తెలిపారు. గ్రూప్–1 ఉద్యోగం ఖచ్చితంగా ఇప్పిస్తానని భరోసా ఇచ్చినట్లు బాధితుడు వెల్లడించారు.

రూ.7 లక్షల వసూలు..

తనకు గ్రూప్–1 ఉద్యోగాన్ని 2022లో ఇప్పిస్తానని సయ్యద్ హైదర్ హుస్సేన్ చెప్పాడని తెలిపారు. బాధితుడి నుంచి రూ.7 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో పరీక్షలు రెండుసార్లు రద్దు అయ్యాయని వివరించారు. తనకు కొంత సమయం ఇవ్వాలని సయ్యద్ హైదర్ హుస్సేన్ మాటలు దాటవేశాడని బాధితుడు ఆరోపించారు. పరీక్షలు రద్దు కావడంతో ఉద్యోగం ఆలస్యమవుతోందని చెప్పాడని పేర్కొన్నారు. మరికొంత కాలం తనను వేచిచూడాలని కోరినట్లు తెలిపారు.


బెదిరింపులు..

తాను చెల్లించిన డబ్బులకు సంబంధించి చెక్ రాసి ఇవ్వాలని తాను ఒత్తిడి తెచ్చినప్పటి నుంచి సయ్యద్ హైదర్ హుస్సేన్‌లో పరిస్థితి క్రమంగా మారుతూ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా, తనను బెదిరింపులకు గురిచేస్తున్నాడని గ్రూప్–1 అభ్యర్థి ఆరోపించారు. డబ్బులు అడిగితే తనను చంపేస్తానని భయపెట్టాడని చెప్పుకొచ్చారు. తనకు ఆయన నుంచి ప్రాణహాని ఉండటంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని గ్రూప్–1 అభ్యర్థి ఫిర్యాదులో తెలిపారు.

బంజారాహిల్స్ పోలీసుల చర్యలు..

గ్రూప్–1 అభ్యర్థి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సయ్యద్ హైదర్ హుస్సేన్ పాత్రపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. డబ్బుల లావాదేవీలు, బాధితుడు చూపించిన ఫొటోలు, చెప్పిన హోదా నిజమేనా అనే అంశాలపై కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సయ్యద్ హైదర్ హుస్సేన్‌ వల్ల ఇంకా ఎవరైనా మోసపోయారనే వివరాలు కూడా వెలికితీస్తామని బంజారాహిల్స్ పోలీసులు పేర్కొన్నారు.


ఉద్యోగాల పేరుతో మోసాలు

ఈ ఘటన ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై మరోసారి హెచ్చరికగా మారింది. గ్రూప్–1, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసే మధ్యవర్తులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తిగా పారదర్శక పరీక్షా విధానాల ద్వారానే వస్తాయని స్పష్టం చేశారు. ఎవరైనా సిఫార్సు, పెద్దల పరిచయాలు అంటూ డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్న నేపథ్యంలో బాధితులకు న్యాయం జరుగుతుందని పోలీసులు భరోసా ఇచ్చారు.

అభ్యర్థుల్లో ఆందోళన..

గ్రూప్–1 వంటి ప్రతిష్ఠాత్మక ఉద్యోగాల కోసం శ్రమిస్తున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటన యువత మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వారిని నమ్మకుండా, చట్టబద్ధమైన మార్గాల్లోనే ముందుకు సాగాలని బంజారాహిల్స్ పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 06 , 2026 | 11:28 AM