Share News

డెత్‌ స్పాట్‌లుగా హిల్స్‌ రోడ్లు

ABN , Publish Date - May 26 , 2026 | 08:24 AM

హైదరాబాద్ హిల్స్‌ రోడ్లు డెత్‌ స్పాట్‌లుగా మారుతున్నాయి. విశాలమైన రోడ్లు, ఏటవాలుగా వేగంగా తిరిగే మలుపులు మృత్యువుకు దారితీస్తున్నాయి.

డెత్‌ స్పాట్‌లుగా హిల్స్‌ రోడ్లు
Road Accidents, Hyderabad

  • వేగంగా తిరిగే మలుపులు.. మృత్యు తలుపులు

  • నిర్లక్ష్యపు గాయాలు

  • మితీమిరిన వేగం వల్లే ప్రమాదాలు

‘‘ఓ హోంగార్డు వచ్చే జీతం సరిపోక ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత నెలలో రైడ్‌ బుక్‌ చేసుకున్న యువతిని ఎక్కించుకొని బయలు దేరాడు. ద్విచక్ర వాహనం బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌.1 జలగం వెంగళరావు పార్కు వద్దకు చేరుకోగానే వెనక నుంచి వచ్చిన వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ ఢీకొట్టాడు. కిందపడ్డ ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ట్యాంకర్‌ డ్రైవర్‌ సరిగ్గా నడిపి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు.’’

‘‘వాచ్‌మన్‌గా విధులు నిర్వహించే ఓ వ్యక్తి తన కుమార్తెను ప్రతీ రోజు స్కూల్‌ నుంచి ఇంటికి తీసుకెళ్తుంటాడు. మార్చి 15న రోజు మాదిరిగానే ఆరు సంవత్సరాల కుమార్తెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌.5 మీదుగా వెళ్తున్నాడు. ఎదురుగా రోడ్డు మీద పార్క్‌ చేసిన బెంజ్‌ కారును చూసి బ్రేక్‌ వెశాడు. వాహనం పక్క నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్కూల్‌ బ్యాగ్‌కు తగలడంతో అదుపు తప్పి తండ్రీకుమార్డె చెరోవైపు పడిపోయారు. బస్సు వెనక చక్రం బాలిక మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది.’’


బంజారాహిల్స్‌(హైదరాబాద్): హిల్స్‌ రోడ్లు డెత్‌ స్పాట్‌లుగా మారుతున్నాయి. విశాలమైన రోడ్లు, ఏటవాలుగా వేగంగా తిరిగే మలుపులు మృత్యువుకు దారితీస్తున్నాయి. అదుపు తప్పుతున్న వేగంతోపాటు నిర్లక్ష్యం ఎదుటి వారిని క్షతగాత్రులుగా మార్చుతుంది. కొంత స్వయం కృపారాధంతో గాయపడుతుండగా, కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తుంది. ముఖ్యంగా బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌.2,3,12 దారులు డెత్‌ స్పాట్‌లుగా మారాయి. ప్రతియేటా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. విశాలమైన రోడ్డు చూడగానే సహజంగా యువత కార్లు కళ్లెం విడిచినట్టు వేగాన్ని పెంచుతున్నారు. వంకర్లు తిరిగే రోడ్లు మృత్యు కుహారాలుగా మారాయి.


రోడ్డు నిర్మాణంలో డిజైన్‌ లోపం ప్రమాదాలకు దారి తీస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కన్న వారికి కన్నీళ్లే మిగులుతున్నాయి. నాగార్జున సర్కిల్‌ నుంచి జూబ్లీహిల్స్‌కు వెళ్లే దారిలో పంజాగుట్ట శ్మశానవాటిక, ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి నుంచి పంజాగుట్ట దారిలో షేక్‌పేట మండల కార్యాలయం దాటిన తర్వాత ఏటవాలుగా వచ్చే మలుపులతో డేంజర్‌ జోన్‌గా మారింది. ఇక్కడ ప్రతీ సంవత్సరం కనీసం పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఇదే తరహాలో బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌.12 కూడా మారింది.


కొంపముంచుతున్న అతి వేగం..

అసలే రోడ్ల డిజైన్‌లో లోపం, దీనికి తోడు కుర్రకారు అతివేగంతో వాహనాలు నడుపుతుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ రోడ్లు విశాలంగా ఉండడం వల్ల ఖరీదైన కార్లతో కుర్రకారు విన్యాసాలు చేస్తున్నారు. ఖరీదైన వాహనాలు రాత్రి సమయాల్లో చేస్తున్న విన్యాసాలు ఇతరులకు ప్రాణసంకటంగా మారాయి. అతి వేగం కారణంగా డివైడర్‌లకు ఢీకొన్న వాహనాల సంఖ్య ప్రతీ నెల పదికిపైగానే ఉంటున్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌.45లో రోడ్డు దాటుతున్న బిక్షాటన చేసే మహిళను మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు కారుతో ఢీకొట్టాడు.


city3.2.jpgఆమె ఎత్తుకున్న పసికందు కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. అతి వేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన పోలీసులు వేగాన్ని కుదించారు. కార్ల డ్రైవర్లు ఈ నిబంధనను అతిక్రమిస్తున్నారు. గతేడాది డిసెంబరులో ఓ యువకుడు అతి వేగంగా కారు నడిపి ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్నాడు. నైట్‌ డ్యూటీ ముగించుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని కారులో వస్తున్న యువకుడు వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే పనిలో పడ్డారు.


అర్థంకాని రోడ్లు..

కేబీఆర్‌ పార్కు నుంచి నాగార్జున సర్కిల్‌కు వెళ్లే రోడ్డు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తుంది. షేక్‌పేట మండల కార్యాలయం దాటగానే రోడ్డు ఏటవాలుగా కిందకు దిగడంతోపాటు మలుపు తిరుగుతుంది. ఈ రోడ్డు గురించి డ్రైవర్లకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్టు గతంలో నిర్ధారణ అయింది. బీటెక్‌ విద్యార్థుల ప్రమాదానికి ఇది ఓ కారణమని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం గ్రీన్‌మాస్క్‌ ఎదురుగా ఉన్న రోడ్డును కాస్త వెడల్పు చేశారు. ఇది మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది. మలుపు ఉండడంతో ఒక్కసారిగా రోడ్డు కిందకు దిగుతుండడం వల్ల కూడా సమస్యలు ఉత్పనమవుతున్నాయి.


ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కూడా ఈ దారిలో వెళ్లే సమయంలో డ్రైవర్‌ పలుమార్లు ఇబ్బంది పడడంతో ఈ విషయాన్ని ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. పోలీసులు కనీసం మలుపునకు సంబంధించిన సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. మిగతా రోడ్లు అంతే. నాగార్జునసర్కిల్‌ వద్ద కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఒకేసారి పెద్ద రోడ్డు కాస్త చిన్నగా అవడంతో వాహనాలకు బ్రేకులు పడుతున్నాయి. వేగంగా వచ్చే వాహనాలు ఇక్కడకు వచ్చేసరికి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టేస్తున్నాయి. రమ్య ఉదంతంలో ఇదే జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి:

గుడ్‌న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..

భోగాపురానికి వస్తున్నాం!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 26 , 2026 | 08:24 AM