అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:41 AM
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటనతో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.
పాదయాత్ర చేపట్టడం సిగ్గుచేటు..
విభజన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలి?: మహేశ్‌గౌడ్
ఓట్ల చోరీ చేస్తూ దొరికిపోయి.. బుకాయిస్తున్నారు: పొన్నం
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటనతో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. అమిత్‌షా.. హైదరాబాద్‌కు వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టడం సిగ్గు చేటని ఓ ప్రకటనలో మండిపడ్డారు. ఇక్కడికి వచ్చి పాదయాత్రలు చేయడం కాదని, ముందుగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, విభజన హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు? తెలంగాణకు రావాల్సిన నిధుల్లో ఎన్ని విడుదల చేశారు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ వంటి హామీల పరిస్థితి ఏమైంది? తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో కేంద్రం వైఖరి ఏమిటి? తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటా, కేంద్ర గ్రాంట్ల విషయంలో రాష్ట్రానికి న్యాయం చేశారా? యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? రైతులకు ఏం చేశారు?’ అంటూ అమిత్‌షాను నిలదీశారు. తెలంగాణకు కేంద్రం చేసిన మేలుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
బీజేపీకి నిజంగా ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే ఓట్ చోరీపై కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణ గుర్తుకు రావడం, ఎన్నికలు పూర్తయ్యాక రాష్ట్ర సమస్యలను పట్టించుకోకపోవడం బీజేపీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. కాగా, హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్‌షా.. విభజన హామీల అమలుపై ఎందుకు మాట్లాడలేదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను విమర్శించడానికే ఆయన హైదరాబాద్ పర్యటనను పరిమితం చేసుకున్నారని ఓ ప్రకటనలో మండిపడ్డారు. అమిత్‌షా హైదరాబాద్ పర్యటన పేలవంగా సాగిందన్నారు. మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడని అమిత్‌షా.. గల్లీ రాజకీయాలను చేస్తున్నారని, ఆయన హోంమంత్రా... లేక గల్లీ మంత్రా అని నిలదీశారు. హైదరాబాద్‌లో అమిత్‌షా ర్యాలీకి స్పందన లేదని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. ఆయన స్పీచ్‌కు బీజేపీ కార్యకర్తలు కూడా స్పందించలేదని చెప్పారు. బీజేపీని ఎప్పటికీ తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమన్న ఏడో గ్యారెంటీని రేవంత్‌రెడ్డి అమలు చేసి చూపించనున్నారని వ్యాఖ్యానించారు. అమిత్ షా పాదయాత్ర చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని.. అది వృథా ప్రయాసేనని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News