ట్రూ-అప్ భారం ప్రజలపైనే..
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:27 AM
విద్యుత్ వినియోగదారుల నుంచి ట్రూ-అప్ (అంచనా వేసిన వ్యయం కన్నా.. వాస్తవికంగా అయిన వ్యయం) చార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయం అమల్లోకి వచ్చింది.
ప్రస్తుత విద్యుత్ చార్జీలతో కలిపి వసూలు
బిల్లులో ట్రూ-అప్ చార్జీగా స్పష్టంగా వెల్లడి
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వినియోగం ఆధారంగా చార్జీ
ఈ నెల బిల్లులో యూనిట్‌కు 30 పైసలు
వచ్చే నెలనుంచి 50 పైసల చొప్పున వసూలు
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారుల నుంచి ట్రూ-అప్ (అంచనా వేసిన వ్యయం కన్నా.. వాస్తవికంగా అయిన వ్యయం) చార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. అక్టోబరులో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించి ఈ నెల వచ్చిన బిల్లులో ప్రస్తుత చార్జీకి అదనంగా ట్రూ-అప్ చార్జీ కూడా వచ్చి చేరింది. దీంతో వినియోగదారులకు ఈ నెల మొత్తం బిల్లు.. ఇంతకుముందు కన్నా అధికం కానుంది. ఉదాహరణకు.. ఓ వినియోగదారుడికి గతనెల (అక్టోబరు) విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లు రూ.230 వచ్చింది. దీనికి ట్రూ-అప్ చార్జీ పేరిట అదనంగా మరో రూ.50 వేశారు. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరంలో వినియోగించిన విద్యుత్‌పై నెలకు సగటున వేసిన ట్రూ-అప్ చార్జీగా బిల్లులో పేర్కొన్నారు. అప్పటి సగటు విద్యుత్ వినియోగాన్ని 167 యూనిట్లుగా చూపించారు. ఒక్కో యూనిట్‌పై 30 పైసల చొప్పున ట్రూ-అప్ చార్జీ వేశారు. దీంతో మొత్తం బిల్లు రూ.280 అయింది. వినియోగదారు ప్రస్తుతం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ఇలా ప్రతి విద్యుత్ వినియోగదారుడికీ ఈ నెల నుంచి ట్రూ-అప్ పేరిట అదనపు భారం పడనుంది. ఈఆర్‌సీ ఇచ్చిన అనుమతి మేరకు దక్షిణ డిస్కమ్ 29 నెలలపాటు, ఉత్తర డిస్కమ్ 26 నెలలపాటు ట్రూ-అప్ చార్జీలు వసూలు చేయనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కరెంట్ కొనుగోళ్ల రూపంలో రూ.5,186 కోట్లు అదనంగా వ్యయం అయ్యాయని, ఆ తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,448 కోట్లు అదనంగా అయ్యాయంటూ.. వీటిని రెవెన్యూ ట్రూ-అప్ కింద వసూలు చేసేందుకు డిస్కమ్‌లు పిటిషన్లు వేయడం, దీంతో మొత్తం ట్రూ-అప్ చార్జీలు కలిపి రూ.7,635 కోట్ల వసూలుకు ఈఆర్‌సీ ఆమోద ముద్ర వేయడం తెలిసిందే. నవంబరులో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబరు నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున ట్రూ-అప్ చార్జీలు వసూలు చేసుకోవాలని టీజీఈఆర్‌సీ అనుమతినిచ్చింది. అయితే ఇందులో రూ.2,214.99 కోట్లను వ్యవసాయ వినియోగం కింద ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లు వసూలు చేసుకోనున్నాయి. మిగిలిన రూ.5,420.23 కోట్లను డిస్కమ్‌లు వినియోగదారుల నుంచి వసూలు చేసుకునే పనిలో పడ్డాయి. ఇందులో దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్-హైదరాబాద్) రూ.4,222.93 కోట్లు, ఉత్తర డిస్కమ్ (టీజీఎన్పీడీసీఎల్-వరంగల్) రూ.1,197.30 కోట్లను ట్రూ-అప్ చార్జీల కింద వసూలు చేయడం ప్రారంభించాయి.
కొన్ని విద్యుత్ బిల్లులను పరిశీలిస్తే
యూనిట్లు ట్రూ-అప్ చార్జీలు
57 యూనిట్లు రూ.17.10
67 యూనిట్లు రూ.20.10
135 యూనిట్లు రూ.40.50
152 యూనిట్లు రూ.45.60
167 యూనిట్లు రూ.50.10
179 యూనిట్లు రూ.53.70
214 యూనిట్లు రూ.64.20
315 యూనిట్లు రూ.94.50
327 యూనిట్లు రూ.98.10
351 యూనిట్లు రూ.105.30
464 యూనిట్లు రూ.98.10
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ మెట్రోకు రూ.275 కోట్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News